బీజేపీ గూటికి మరో ఉద్యమ నేత.. తెరవెనక కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్..?

By team teluguFirst Published Dec 2, 2021, 10:28 AM IST
Highlights

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మరో కీలక నేత బీజేపీ (BJP) కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. దీని వెనకాల మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. 

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ (BJP).. ఆ క్రమంలోనే పలువురు కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మరో కీలక నేత కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న విఠల్ (Vital).. ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో తన వంత పాత్ర పోషించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ఆయనను  టీఎస్‌పీఎస్సీ (TSPSC) సభ్యుడిగా నియమించారు. అయితే ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత విఠల్‌‌ను ఖాళీగానే ఉంటున్నారు. ఆయనకు ఏదైనా కార్పొరేషన్ పదవి దక్కవచ్చనే ప్రచారం సాగినప్పటికీ అది కుదరలేదు. 

దీంతో విఠల్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. అలాగే ఉద్యోగ నియమాకాల విషయంలో సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు ఆయనకు అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో మరింత అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అసంతృప్తిని గ్రహించిన బీజేపీ నేతలు.. ఆయనన తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిపారు. పలు దశలుగా సంప్రదింపులు జరిపిన తర్వాత.. విఠల్ బీజేపీ‌లో చేరడానికి సిద్దమయ్యారు. త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొనున్నారు. 

విఠల్ గురించి.. 
విఠల్.. . వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్‌లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.కామ్‌, ఎల్‌ఎల్‌బీ(ఎం.ఫిల్‌) చదివారు. కొంత కాలం జర్నలిస్టుగా, ఓ ఎయిడెడ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2లో ఆడిటర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే తెలంగాణ ఉద్యమంలో విఠల్ చాలా చురుకుగా పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయడం విఠల్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఘట్టంలోను విఠల్ తన వంతు పాత్ర పోషించారు. 

కీలకంగా వ్యవహరించిన ఈటల..!
విఠల్‌ను బీజేపీలోకి తీసుకురావడం వెనకాల మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న విఠల్.. బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి ఈటలనే ప్రధాన కారణమని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులతో ఈటల రాజేందర్ ప్రత్యేకంగా మంతనాలు జరిపి.. బీజేపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు విఠల్ చేరికతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి కలిసివస్తుందని తెలంగాణ బీజేపీ లెక్కలు వేస్తుంది. 

చాలా రోజులుగా అసంతృప్తి..!
విఠల్ చాలా రోజులుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడాన్నిఆయన తప్పుబట్టారు. అంతేకాకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదల, నియమాకాల పట్ల ఆయన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి, విఠల్‌కు దూరం పెరిగినట్టుగా చెబుతున్నారు. 

గతేడాది స్వామిగౌడ్.. 
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న స్వామిగౌడ్.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీగా చేసిన కేసీఆర్.. మండలి చైర్మన్‌ను కూడా చేశారు. అయితే ఆ పదవీకాలం ముగిసి తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌పై అసంతృప్తి పెంచుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో ఆయన బీజేపీలో చేరారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మాభిమానం కోసం తెలంగాణ ఉద్యమం చేశామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. బీజేపీలో చేరడమంటే తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆయన పేర్కొన్నారు. 

బీజేపీ కూడా తెలంగాణలో విస్తరించాలంటే ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారిని ఎక్కువగా పార్టీలో చేర్చుకునేలా అడుగులు వేస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న.. స్వామిగౌడ్, విజయశాంతి, ఈటల రాజేందర్ బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు విఠల్ కూడా అదే బాటలో నడవనున్నారు. మరికొందరు ఉద్యమ నేతలు కూడా బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

click me!