కానిస్టేబుల్ పరీక్షలో తప్పులు వచ్చాయనే ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్

By Sumanth KanukulaFirst Published Aug 29, 2022, 5:11 PM IST
Highlights

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు వచ్చాయని జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌ రావు  ఖండించారు. త్వరలోనే వెబ్‌సైట్‌లో కీ విడుదల చేస్తామని చెప్పారు.

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు వచ్చాయని జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌ రావు  ఖండించారు. త్వరలోనే వెబ్‌సైట్‌లో కీ విడుదల చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కానిస్టేబుల్ పోస్టులకు ఆగస్టు 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమినరీ వ్రాత పరీక్షను నిర్వహించిందని చెప్పారు. హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 38 పట్టణాల్లో మొత్తం 1,601 పరీక్షా కేంద్రాలలో  ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినట్టుగా చెప్పారు. 6 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. 

ప్రణాళికాబద్ధమైన షెడ్యూల్ ప్రకారం.. అన్ని నిబంధనలను నిశితంగా పాటించడం ద్వారా పరీక్ష సజావుగా నిర్వహించబడిందని చెప్పారు. తదుపరి ప్రక్రియను సులభతరం చేయడానికి పరీక్ష సమయంలో డిజిటల్ వేలిముద్రలు, డిజిటల్ ఛాయాచిత్రాలతో సహా అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు సేకరించినట్టుగా చెప్పారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.inలో కొన్ని రోజుల్లో అందుబాటులో ఉంచనున్నట్టుగా తెలిపారు. 

ఈ పరీక్షకు సంబంధించి కొన్ని ప్రశ్నల గురించి గందరగోళం ఉందని సోషల్ మీడియా, మీడియా విభాగాలలో కొన్ని నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలిసిందని చెప్పారు. అయితే ఇవి పూర్తిగా నిరాధారమైనవి అని అన్నారు. అభ్యర్థులను తప్పుదారి పట్టించే స్వభావం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. 

ఇక, ఈ విషయంలో అన్ని సమస్యలను న్యాయంగా, పారదర్శకంగా పరిష్కరిస్తూ సబ్జెక్ట్ నిపుణుల కమిటీల చర్చల తర్వాత ప్రిలిమినరీ కీ కొన్ని రోజుల్లో విడుదల చేయబడుతుందన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్, ప్రెస్ నోట్స్, వ్యక్తిగతంగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని సూచించారు. తప్పుడు సమాచారంతో ఆందోళన చెందకూడదని చెప్పారు.

click me!