పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.
పెద్దపల్లి: పెద్దపల్లిలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని సోమవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇవాళ మధ్యాహ్నం హైద్రాబాద్ నుండి పెద్దపల్లికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. తొలుత పెద్దపల్లిలోని గౌరెడ్డిపేటలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ను పార్టీ కార్యాలయంలోని ఆయన చాంబర్ లో కేసీఆర్ కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు.
అనంతరం పెద్దపల్లిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
undefined
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో నూతన కలెక్టరేట్ల కార్యాలయాల నిర్మాణాలను చేపట్టింది. ఇటీవలనే వికారాబాద్, మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్ల నూతన కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించారు.
పెద్దపల్లి జిల్లాలోని పెద్దకల్వల సమీపంలో 22 ఎకరాల ఎస్ఆర్‌ఎస్‌పీ క్యాంప్ కార్యాలయ స్థలంలో. రూ.48.07 కోట్లతో నూతన కలెక్టరేట్ ను నిర్మించారు.ఈ భవనంలో అన్ని రకాల సదుపాయయాలను కల్పించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఆరు బ్లాకులుంటాయి. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో 98 గదులున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో 40 గదులున్నాయి. మొదటి అంతస్తులో 29, రెండో అంతస్తులో 29 గదులున్నాయి. కలెక్టరేట్ లో సుమారు 41 శాఖలకు చెందిన కార్యాలయాలుంటాయి. కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులు తమ వాహనాలను పార్క్ చేసుకొనేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు.
జిల్లాకు చెందిన మంత్రి, కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా అన్ని జిల్లా స్థాయి అధికారుల కోసం ప్రత్యేక చాంబర్లను కలెక్టరేట్ లో ఉన్నాయి. కలెక్టరేట్ కు సమీపంలోనే అధికారుల నివాస గృహాలను కూడా నిర్మించనున్నారు. వీటి కోసం రూ. 6.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. జిల్లా అధికారుల నివాస గృహాల్లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఎనిమిది మంది అధికారుల నివాసాల నిర్మాణాలు పూర్తయ్యాయి.
తెలంగాణ వైపు భారత్ చూపు: కేసీఆర్
అద్భుత విజయాలతో పురోగమిస్తున్న తెలంగాణను చూసి భారతదేశం కూడా నేర్చుకొనే ప్రయత్నంలో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.పెద్దపల్లిలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్ సమావేశమందిరంలో కొద్దిసేపు మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా ఏ రకంగా మనం పనిచేశామో అదే పట్టుదలతో రానున్న రోజుల్లో పనిచేయాలని సీఎం కేసీఆర్ కోరారు. కొత్త పరిపాలన భవనంలో ప్రజల ఆశలు నెరవేరాలన్నారు. ప్రజలఆశయాలు నెరవేర్చేందుకు అధికారులు సంపూర్ణ విజయం సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
పెద్దపల్లి నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించుకున్న సందర్భంగా జిల్లాకు చెందిన అధికారులను కేసీఆర్ అభినందించారు.