వాళ్లవి ఉద్దెర ముచ్చట్లు.. కేసీఆర్‌వి అన్నీ నగదు మాటలే.. జమ్మికుంటలో స్పీకర్ పోచారం శ్రీనివాస్

By telugu teamFirst Published Sep 25, 2021, 8:17 PM IST
Highlights

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆత్మీయ రెడ్డి సమ్మేళనంలో మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని చెప్పారు.
 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ హుజరాబాద్ సమీపంలోని జమ్మికుంటలో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. హుజురాబాద్‌లో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జమ్మికుంటలో నిర్వహించిన సమావేశంలో ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రతిపక్షాలవి ఉద్దెర మాటలని, కేసీఆర్‌వి ఉద్దెర మాటలు కాదని, ఆయనవన్నీ నగదు మాటలేనని అన్నారు. ఆయన ప్రజా సంక్షేమం కోసం పనిచేసి మాట్లాడతారని, మిగతా వారు కేవలం మాటలకే పరిమితమవుతారని చెప్పారు.

పెద్ద ఎత్తున హుజురాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల వారి ఆహ్వానం మేరకు, మంత్రి హరీశ్ రావు కోరిక మేరకు జమ్మికుంటకు వచ్చినట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హరీశ్ రావు ఈ కార్యక్రమానికి 15వేల మంది వస్తారని చెప్పారని, కానీ, ఇక్కడ చూస్తే అంతకు మించి ఉన్నారని అన్నారు. తాను అక్కడికి స్పీకర్‌గా కాదని, పోచారం శ్రీనివాస్ రెడ్డిగా వచ్చినట్టు చెప్పారు.

కేసీార్ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు కావాల్సిన స్థలాలు, నిధుల మంజూరు, సౌకర్యాలు కల్పిస్తూనే ఉన్నారని పోచారం చెప్పారు. తెలంగాణ రాకముందు గ్రామాలకు వెళ్తే రైతులు నిలదీస్తారనే భయం ఉండేదని, ఇప్పుడు 24 గంటలు సాగుకు కరెంట్ అందిస్తూ వారి తలెత్తే పరిస్థితులు కేసీఆర్ ప్రభుత్వం చేసిందని వివరించారు. ఈ విషయాన్ని ఢిల్లీ వెళ్లినప్పుడు చెబితే వారు నమ్మడం లేదని తెలిపారు.

బాన్సువాడలో సీఎం సహకారంతో 5000 డబుల్ బెడ్ రూం ఇల్లు పూర్తి చేశామని, వాళ్లంతా గృహ ప్రవేశం కూడా చేశారని తెలిపారు. మరో 5000 ఇళ్లనూ కేసీఆర్‌ను అడిగినట్టు చెప్పారు. త్వరలో అవి కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటాయని చెప్పారు.

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని, ఇక్కడ పదిస్తే 11 ఇచ్చి వాళ్లు మాట్లాడాలని, కళ్యాణ లక్ష్మీకి ఇక్కడ లక్ష ఇస్తున్నప్పుడు వాళ్లు రెండు లక్షలు ఇచ్చి మాట్లాడాలని హితవు పలికారు. రైతు బంధు పథకానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్నదని తెలిపారు. రైతు బీమా కింద గుంట భూమి ఉన్నా వారసులకు రూ. 5 లక్షలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దేనని చెప్పారు. కరోనా వల్ల డబ్బుల్లేకుంటే బ్యాంకుల నుంచి 36వేల కోట్ల రూపాయలు బ్యాంకుల రుణం తెచ్చి రైతులకు పంట డబ్బులను అందించారని తెలిపారు.

click me!