హైదరాబాద్ పేరు మార్పు చర్చపై బీజేపీకి కేటీఆర్ పంచ్.. ఏమన్నాడంటే?

By Mahesh KFirst Published Jul 4, 2022, 12:47 PM IST
Highlights

ప్రధాని మోడీ నిన్న హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుతూ.. భాగ్య నగర్‌గా సంబోధించారు. దీంతో హైదరాబాద్ పేరు మార్చనున్నారా? అనే చర్చ మొదలైంది. అయితే, ఈ చర్చకు కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెట్టారు. తనదైన శైలిలో బీజేపీకి పంచ్ వేశారు.
 

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు హెచ్ఐసీసీలో జరిగాయి. ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ఆయన భాగ్యనగర్ అని సంబోధించారు. ఈ విషయం బయటకు రావడంతో హైదరాబాద్ నగరం పేరు మార్చాలని బీజేపీ బలంగా భావిస్తున్నదా? అనే చర్చ మొదలైంది.

ఈ చర్చ జరుగుతుండగానే రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీజేపీకి పంచ్‌లు వేశారు. ప్రధాని మోడీ నిన్న భాగ్యనగర్ అని సంబోధించగానే.. నిన్ననే రాత్రి ఆయన ట్విట్టర్‌లో రెస్పాండ్ అయ్యారు. ఈ సందర్భంగానే రఘుబర్ దాస్ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగర్‌గా పేరు మారుస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందనగా కేటీఆర్ కామెంట్ చేశారు.

Why don’t you change Ahmedabad’s name to Adanibad first?

Who is this Jhumla Jeevi by the way? https://t.co/xD8y6mrfUi

— KTR (@KTRTRS)

ముందు మీరు అహ్మెదాబాద్ పేరును అదానీబాద్‌గా ఎందుకు మార్చరు? అని ప్రశ్నించారు. అంతేకాదు. రఘుబర్ దాస్‌ను ఉద్దేశిస్తూ.. ఇంతకీ ఈ ఝుమ్లా జీవి ఎవరు అని అడిగారు. నకిలీ వాగ్దానాలనే ఝుమ్లా అంటారని తెలిసిందే. అహ్మదాబాద్ గుజరాత్‌లోని అతిపెద్ద నగరం. గుజరాత్ రాష్ట్రానికి గతంలో రాజధానిగానూ ఉన్నది. గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే, పారిశ్రామిక వేత్త అదానీ గుజరాత్‌కు చెందినవారే కావడం గమనార్హం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీలకు అనుగుణమైన పాలన చేస్తున్నదని, ఆర్థికంగా వారి ఎదుగుదలకు తోడ్పడుతూ క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ సంవత్సరాలుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను మరింత వివరిస్తూ నిన్న బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ అందరికీ ఎంతో విలువైన భాగ్య నగర్ అని పేర్కొన్నట్టు తెలిపారు. సర్దార్ పటేల్ ఇక్కడే దేశాన్ని ఏకం చేయడానికి పునాదులు వేశారని వివరించారు. ఇప్పుడు ఆ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీపై ఉన్నదని తెలిపారు.

బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌లు హైదరాబాద్‌ పేరు మార్చాలని పలుమార్లు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలని పేర్కొన్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా హైదరాబాద్‌ను భాగ్యనగర్ అని పలకడంతో పేరు మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. ఇక్కడ పేరు మార్చే డిమాండ్‌ను బీజేపీ బలంగా ముందుకు తెస్తున్నదా? అనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి పియూష్ గోయల్‌ను ఈ విషయమై ప్రశ్నించగా.. ఆయన దాదాపు ఔను అన్నట్టుగానే సమాధానం ఇచ్చారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులతో కలిసి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారని పియూష్ గోయల్ వివరించారు.

click me!