
హైదరాబాద్: యాదాద్రి ఆలయ ప్రారంభానికి చినజీయర్‌కు ఆహ్వానం అందలేదు. ఆలయ ప్రారంభ ప్రక్రియకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరును ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పూజలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా బాలాలయంలో ఆంతరంగికంగా పంచకుండాత్మక మహా సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో 108 మంది పురోహితులు, వేద పండితులు పాల్గొననున్నారని కలెక్టర్ పమేలా సత్పతి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చినజీయర్ పెట్టిన ముహూర్తానికే పూజలు జరుగుతాయని ఆ ప్రకటన పేర్కొన్నది. కానీ, ఆయన ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తారని ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. అయితే, ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆ ప్రకటన తెలిపింది. అందులో చినజీయర్ పేరు మాత్రం లేదు. కాగా, ఆలయాన్ని మాత్రం తామే ప్రారంభిస్తామని స్థానిక అర్చకులు తెలుపడం గమనార్హం.
సుదర్ణ యాగం ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానుంది. స్వస్తివాచనంతో ఈ యాగం ప్రారంభం అవుతుంది. 28న మహాకుంభ సంప్రోక్షణ చేసి ఆలయ ఉద్ఘాటన చేయనున్నారు.
గతంలో చినజీయర్ స్వామి ఏదో ప్రసంగం సందర్భంగా సమ్మక్క సారలమ్మపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చాలా పాత వీడియో. ఎక్కడ, ఏ సందర్భంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారో తెలియడం లేదు గానీ దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వైరల్ గా మారిన చిన్ జీయర్ స్వామి ఆ వీడియోలో సమ్మక సారలక్క గురించి ప్రస్తావించారు. వారు దేవతలు కారని చెప్పారు. అసలు సమ్మక, సారలమ్మలు ఎవరని అన్నారు. వారేం దేవతలా అని తెలిపారు. బ్రహ్మ లోకం నుంచి దిగొచ్చిన వారా ? అని అన్నారు. వారి చరిత్ర ఏమిటి అని అడిగారు. వారు ఏదో గ్రామ దేవత అని చెప్పారు. కానీ చదువుకున్న వారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లు కూడా నమ్ముతున్నారని తెలిపారు. ఆ పేర్లతో బ్యాంకులు కూడా పెట్టేశారని అన్నారు. అది ప్రస్తుతం వ్యాపారం అయిపోయిందని చెప్పారు.
ఈ వీడియో బయటకు వచ్చిన నాటి నుంచి చిన జీయర్ స్వామిని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఆంధ్రాకు చెందిన స్వామిని, అందుకే తెలంగాణ వన దేవతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణలో సమక్క సారలక్కను వన దేవతలుగా కొలుస్తామని, ఇక్కడ అందరూ సమానమే అని చెబుతున్నారు. ఆ వీడియోను వాట్సప్, ఫేస్ బుక్ స్టేటస్ లుగా షేర్ చేస్తూ వారి అభిప్రాయాన్ని జత చేస్తున్నారు. చిన జీయర్ వ్యాఖ్యలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క, సీపీఐ నేత నారాయణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిమీద ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన ‘సమ్మక్క, సారలమ్మ’లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్ ని Yadagiri Gutta ఆగమ శాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే KCR తొలగించాలి. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.