మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ కుట్రలకు తెరలేపిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాజ్యంగ వ్యవస్థలను బీజేపీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్యాణమని కేటీఆర్ చెప్పారు.
పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి అభ్యర్ధులకు కేటాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించిందని ఆయన గుర్తు చేశారు.మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్ ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమన్నారు.కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందేందుకు కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని ఆయన విమర్శించారు.
పారదర్శకంగా ఎన్నికలు జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఎన్నికల సంఘం తీరు విఘాతం కల్గిస్తుందని న్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం బీజేపీ దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్ బదిలీపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.మునుగోడులో ఓటమి తప్పదనే భయంతో బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని కేటీఆర్ విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపులో రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరుపై ఈసీ సీరియస్ అయింది. శివకుమార్ అనే అభ్యర్ధికి రోడ్డు రోలర్ గుర్తును కేటాయిచకుండా నిలిపివేసింది.
alsoread:మునుగోడు బైపోల్ 2022:రిటర్నింగ్ అధికారిని మార్చాలని ఈసీ నిర్ణయం
ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి శివకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన ఈసీ శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. ఈ విషయమై ఇవాళ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ విచారణ నిర్వహించారు.
రిటర్నింగ్ అధికారిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగింది. ముగ్గురు అధికారుల పేర్లను ఈసీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ముగ్గురు అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని ఈసీని టీఆర్ఎస్ కోరింది. ఈ గుర్తుల వల్ల తమ పార్టీ అభ్యర్ధుల విజయావకాశాలు దెబ్బతింటాయని టీఆర్ఎస్ చెబుతుంది. ఇదే విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు కి వినతి పత్రం సమర్పించారు. అయితే ఈ విషయమై సరైన స్పందన లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను కోర్టు కోట్టి వేసిన విషయం తెలిసిందే.
కారు గుర్తును పోలిన రోడ్డురోలర్, కెమెరా, చపాతి రోలర్, డాలీ, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను ఎన్నికల గుర్తుల జాబితా నుండి తొలగించాలని టీఆర్ఎస్ కోరింది.ఇదే డిమాండ్ తో గతంలో కూడ ఈసీఐకి కూడా టీఆర్ఎస్ వినత పత్రం సమర్పించింది. నిన్న కూడ టీఆర్ఎస్ బృందం ఈసీఐని కలిసి వినతి పత్రం సమర్పించారు.