
తెలంగాణలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం తమపై నమ్మకముంచిన ప్రజల సంక్షేమం కోసం మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్ తో కేటీఆర్ ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ ప్రజలు, రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ది కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి నికోల్ గిరార్డ్ కు కేటీఆర్ వివరించారు. అలాగే పారిశ్రామిక రంగం అభివృద్దికోసం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. ఇలా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలఅభివృద్ధి కోసం మరిన్ని వినూత్న ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
రెండోసారి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినందుకు గిరార్డ్ కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం నాలుగున్నరేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించారంటూ ఆమె ప్రశంసించారు. అనంతరం కేటీఆర్ ఆమెను శాలువాతో సత్కరించి ఓ జ్ఞాపికను అందజేశారు.
ఇక కేటీఆర్, గిరార్డ్ మధ్య తెలంగాణ- కెనడాల మధ్య వ్యాపార సంబంధాల గురించి చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో వ్యాపార అనుకూలతలు, సరళతరం చేసిన పరిశ్రమల అనుమతుల గురించి కేటీఆర్ ఆమెకు వివరించారు. కెనడా పారిశ్రామికవేత్తలను, మల్టీ నేషనల్ కంపనీలను తెలంగాణ ప్రభత్వం సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
వీడియో
"