ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.. గోదాం ప్రారంభోత్సవంలో తీవ్ర ఉద్రిక్తత..

By Sumanth KanukulaFirst Published Nov 26, 2022, 4:55 PM IST
Highlights

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో గోదాం ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో గోదాం ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు నేతలు వేదికపై ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాలు.. శనివారం మేళ్లచెరువు పీఏసీఎస్ నూతన గోదాం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సైదిరెడ్డి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే హుజుర్‌నగర్ అభివృద్ది చెందిందని పేర్కొన్నారు.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీ గురించి మాట్లాడారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగానికి టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు జై సైదిరెడ్డి అంటూ నినాదాలు చేశారు. అయితే ఇది సరైన విధానం కాదని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించినవారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

అయితే ఇటీవల కూడా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హుజూర్‌నగర్‌ మండలం అమరవరంలో జరిగిన పీఏసీఎస్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. పంట రుణమాఫీ, పంటల బీమాపథకాల అమలుపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నా రు. దీంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సభ అర్ధాంతరంగా ముగిసింది. 
 

click me!