13, 14వ తేదీల్లో వాళ్లు నాపై దాడి చేస్తారేమో.. వాటికి కేసీఆరే బాధ్యత వహించాలి: ఈటల

By telugu teamFirst Published Oct 3, 2021, 4:31 PM IST
Highlights

‘13, 14వ తేదీల్లో నాపై నేనే దాడి చేయించుకుంటా అని ఓ ఎమ్మెల్యే నీచమైన ఆరోపణలు చేస్తున్నాడు. నేను అలాంటి చిల్లర పనులు చేయను. బరిగీసే కొట్లాడుతా.. ’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ తేదీల్లో వాళ్లే తనపై దాడి చేస్తారేమోననే అనుమానం ఉన్నదని తెలిపారు. అలా జరిగితే ఆ పరిణామాలకు కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
 

కరీంనగర్: హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య వాగ్బాణాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. హుజురాబాద్‌లో జరిగిన ఎన్నికల శంఖారావం సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. తాను ఏనాడూ ఇంతటి నీచ రాజకీయాలను చూడలేదని విమర్శించారు. తాను ఆ పార్టీలో ఉన్నప్పుడూ ఇంతటి దిగజారుడు ఆరోపణలు వినలేదని అన్నారు. ‘13వ, 14వ తేదీల్లో నాపై నేనే దాడి చేయించుకుంటాను అని ఓ ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు’ తద్వారా సానుభూతి పొంది గెలువడానికి ప్రయత్నం చేస్తారని అన్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి నీచమైన ఆరోపణలు వారు చేస్తున్నారని తెలిపారు.

‘ఈటల రాజేందర్ బరిగీసి కొట్లాడుతాడు తప్ప.. ఇలాంటి చిల్లర పనులు చేయడు. గతంలో నేను పాదయాత్ర చేసి కాలుకు నొప్పి వస్తే కూడా హరీశ్‌రావు వంటివాళ్లు ఇలాగే మాట్లాడారు. నకిలీ లేఖలు సృష్టించి బద్నాం చేసే ప్రయత్నం చేశారు’ అని ఈటల అన్నారు. 

‘13వ, 14వ తేదీల్లో వాళ్లే నాపై దాడి చేస్తారనే అనుమానం ఉన్నది. ఇలాంటిదేదైనా జరిగితే అగ్నిగుండమవుతుంది.. జాగ్రత్త. అలా జరిగితే తర్వాతి పరిణామాలన్నింటికీ కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలి’ అంటూ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలకు సాధారణంగా 2+2 గన్‌మెన్‌లు ఉంటారని, కానీ, తనకు మాత్రం ఒక్కరినే ఇచ్చాడని అన్నారు. తనలాంటివాళ్లకు గన్ మెన్ అవసరం లేదని, తనను ప్రజలు, కార్యకర్తలే రక్షించుకుంటారని తెలిపారు.

హుజురాబాద్‌లో ఇంటింటికి వెళ్లి ఓటు అడిగితే చాలు.. వాళ్లే వేస్తారని ఈటల ధీమ వ్యక్తం చేశారు. ఈ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ ఎన్నో కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు చేశారు. మద్యం సీసాలు, డబ్బునే వారు నమ్ముకున్నారని అన్నారు. అలాంటి కుట్రలకు హుజురాబాద్ ప్రజలు తగిన పాఠం చెబుతారని తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికలో అందరూ వెల్లువెలా వచ్చి కమలం పువ్వుకే ఓటేస్తారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండానే ఎగురుతుందని అన్నారు.

click me!