నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ: హుజూరాబాద్ బైపోల్, పార్టీ సంస్థాగతంపై చర్చ

By narsimha lodeFirst Published Aug 24, 2021, 11:10 AM IST
Highlights


హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇవాళ జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్ఘ సమావేశంలో ఈ విషయమై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ బాధ్యతలను అప్పగించనున్నారు.

కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ కేంద్రీకరించింది. మంగళశారం నాడు మధ్యాహ్నం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది.

గెల్లుశ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం కొందరు పార్టీ ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంచార్జీలను గులాబీ బాస్ ప్రకటించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందిన వారిని కలిసి టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని గులాబీదళం నిర్ణయించింది. ఇప్పటికే లబ్దిదారులకు సీఎం కేసీఆర్ రాసిన లేఖలను పంపారు.

 హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో  దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.  దళితబంధును హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకురావడంపై విపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించాయి.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీ నిర్మాణంపై కూడ చర్చించనున్నారు. ఆయా జిల్లాల్లో ఇతర పార్టీల నుండి నేతలు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో పార్టీ పునర్నిర్మాణంపై కూడ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించనున్నారు.

పార్టీ సభ్యత్వ కార్యక్రమం ముగిసింది. రాష్ట్ర,జిల్లా, మండల, గ్రామ స్థాయి పార్టీ కమిటీల నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రతి జిల్లాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం గురించి కూడ చర్చిస్తారు.


 

click me!