అమిత్ షాతో డిఎస్ భేటీ: మతలబు ఏమిటి?

By Siva KodatiFirst Published Jul 11, 2019, 9:08 PM IST
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన కర్ణాటకలో స్వింగ్ చేసిన బీజేపీ.. తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొంది కమలానికి ఇక్కడ స్పేస్ ఉందన్న విషయాన్ని గుర్తించింది. 

సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిన కర్ణాటకలో స్వింగ్ చేసిన బీజేపీ.. తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొంది కమలానికి ఇక్కడ స్పేస్ ఉందన్న విషయాన్ని గుర్తించింది. దానికి తోడు తమకు కొరకరాని కొయ్యగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎలా పాగా వేయ్యాలా అని చూస్తోన్న బీజేపీ వ్యూహాకర్తలకు ఈ విజయం ఒక దారి చూపిందన్నది వాస్తవం.  

ఆ ఊపులో చాపకింద నీరులా విస్తరించడం ప్రారంభించింది. ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలను ఆకర్షిస్తూ చేరికలను ప్రొత్సహిస్తోంది. ఇప్పటికీ పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను టార్గెట్ చేసిన బీజేపీ... తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్‌లోని పలువురు అసంతృప్తులను పార్టీలోకి చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. 

ఇప్పటికే గోదావరిఖనికి చెందిన టీఆర్ఎస్ కీలక నేత సోమారపు సత్యనారాయణ బీజేపీ గూటికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కోవలో అధికారపార్టీకి మరో షాక్ ఇచ్చించేందుకు కమలనాధులు సిద్ధమైనట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి చెప్పవచ్చు. టీ

ఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన అయిన డీఎస్.. తొలుత ప్రభుత్వ సలహాదారుగా ఉండగా.. అనంతరం ఆయనను కేసీఆర్ రాజ్యసభకు పంపారు.

అయితే తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్న కారణంతో డీఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ తరపున గెలిచారు. 

ఈ విజయం అలాంటి ఇలాంటిది కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారాలపట్టి కవితపై అరవింద్ సంచలన విజయం సాధించారు. దీని వెనుక డీఎస్ వ్యూహాలు ఉన్నాయని రాజకీయ వర్గాల అంచనా.. తెలంగాణలో పార్టీ జెండా ఎగరవేయాలని భావిస్తోన్న బీజేపీ పెద్దలు ప్రతిరోజు ఢిల్లీ నుంచి మానిటరింగ్ చేయాల్సిన పరిస్ధితి. 

అందుకే ఛరిష్మా ఉన్న నేతల కోసం కమలనాధులు వెతుకుతున్నారు. ఈ దశలో రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరొందిన డీఎస్.. అమత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బీజేపీలో చేరేందుకే శ్రీనివాస్.. షాను కలిశారని త్వరలోనే కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డీఎస్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ జైత్రయాత్రకు బ్రేక్ వేసి వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. 

అలాంటి నేతను సరిగ్గా ఉపయోగించుకుంటే కమలానికి తిరుగుండదని విశ్లేషకుల అంచనా. మరి డీఎస్ పార్టీ మారేందుకు అమిత్ షాను కలిశారా..? లేదంటే ఇది మర్యాదపూర్వక భేటీ అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా.. ఆయన ఇటీవల జరిగిన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే..
 

click me!