నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య తనయుడే

By telugu teamFirst Published Mar 29, 2021, 1:18 PM IST
Highlights

నాగార్జునసాగర్ అసెంబ్లీ సీటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేశారు. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తనయుడు నోముల భగత్ కే టికెట్ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.

హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి టికెట్ ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ అభ్యర్థిత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు ఖరారు చేశారు. అయితే, ఆయన అభ్యర్థిత్వాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

నోముల భగత్ కు కేసీఆర్ సోమవారంనాడే బీ ఫారమ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన రేపు మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తారు. నోముల భగత్ కు కాకుండా మరొకరిని పోటీకి దించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే, చివరికి నోముల భగత్ కే టికెట్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

నోముల భగత్ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి కేసీఆర్ తో సమావేశమయ్యారు. నాగార్జునసాగర్ టికెట్ ఆశించిన కోటిరెడ్డిని టీఆర్ఎస్ బుజ్జగిస్తోంది. ఆయన సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన కేసీఆర్ తో బేటీ అయ్యారు కోటిరెడ్డి బిజెపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

కాంగ్రెసు నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెసు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించింది. బిజెపి ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయితే, బిజెపి నేత నివేదిక నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ టికెట్ తనకే వస్తుందనే విశ్వాసంతో ఆమె ఉన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ నాయకులను ఆదేశించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డిని ఇంచార్జీగా నియమించే అవకాశం ఉంది.

click me!