చంద్రబాబు ప్రభుత్వ టీవీ యాడ్స్ పై వినోద్ సీఈసికి ఫిర్యాదు

By pratap reddyFirst Published 18, Nov 2018, 7:40 PM IST
Highlights

వారు పార్టీ పరంగా ప్రకటనలు ఇవ్వొచ్చునని, అందుకు తమకేమీ అభ్యంతరాలు లేవని, అయితే చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయాలని కోరామని వినోద్ కుమార్ చెప్పారు.

హైదరాబాద్: టివి ఛానెల్ లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రకటనలు విస్తృతంగా  వస్తున్నాయని, చంద్రబాబు నాయుడు అక్కడి పథకాలపై ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అభ్యంతరం చెప్పారు.
ప్రభుత్వం డబ్బుతో ప్రకటనలు చేస్తున్నారని, అయితే చంద్రబాబు పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తోందని, అంతేకాకుండా చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి కూటమి ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. 

కాంగ్రెస్, టిటిడిపి నేతలు అమరావతి కి వెళ్లారని, ఇక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో  తాము ఎపి ప్రభుత్వ ప్రకటననలను ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఆదివారం ఎన్నికల కమిషన్ అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాష్ ను ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

బుద్ధ ప్రకాష్ కు కూడా తాను  వివరించినట్లు వినోద్ కుమార్ తెలిపారు. బుద్ధ ప్రకాష్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ లేనప్పటికీ ఆ ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇస్తున్నారని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ పిర్యాదు చేస్తామని, వారి ప్రభుత్వ సొమ్ము తో ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు. 

వారు పార్టీ పరంగా ప్రకటనలు ఇవ్వొచ్చునని, అందుకు తమకేమీ అభ్యంతరాలు లేవని, అయితే చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయాలని కోరామని వినోద్ కుమార్ చెప్పారు. .
బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందు ముస్లిం మనోభావాలు దెబ్బతినెలా కార్టూన్స్ వేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. 

తమ పార్టీ కి సంబంధించిన 6 పాటలు వ్రాయించామని, దీనిపై కూడా ఎన్నికల కమిషన్ అనుమతి కోసం పాటల సిడి ఇచ్చామని చెప్పారు. వారు అన్ని విన్న తర్వాత పాటల విడుదల పై అనుమతి ఇస్తామని చెప్పారని ఆయన అన్నారు. వాటిలో  కొన్ని పాటలు కేసీఆర్ స్వయంగా రాశారని చెప్పారు. .

Last Updated 18, Nov 2018, 7:40 PM IST