మునుగోడు ఉపఎన్నిక.. ఓటర్ల జాబితా పేరుతో బీజేపీ డ్రామాలు, ఓడిపోతే తప్పించుకునేందుకే : పల్లా రాజేశ్వర్ రెడ్డి

By Siva Kodati  |  First Published Oct 14, 2022, 4:42 PM IST

బీజేపీపై మండిపడ్డారు టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. రేపు మునుగోడులో ఓడిపోతే కొత్త ఓటర్ల జాబితాపైకి నెట్టేసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందన్నారు. దొంగ ఓట్లను ఈసీ తిరస్కరించడంతో కోర్టులంటూ బీజేపీ డ్రామాలు ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
 


మునుగోడులో కొత్త ఓటర్ల జాబితాపై బీజేపీ నాటకాలు ఆడుతోందని విమర్శించారు టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు మునుగోడులో ఓడిపోతే కొత్త ఓటర్ల జాబితాపైకి నెట్టేసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వుండదని, కేంద్రం చేతుల్లోనే వుంటుందని పల్లా చురకలు వేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుందని ఆయన ఆరోపించారు. లొంగని అధికారులను బలవంతంగా బదిలీ చేస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయాడని ఆయన ఆరోపించారు. 18 వేల కోట్లలో కొన్ని వందల కోట్లతో ఇక్కడున్న నాయకులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారని పల్లా వ్యాఖ్యానించారు. కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు మునుగోడు ప్రజలకు కూడా అందుతున్నాయని ఆయన చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలను కేసీఆర్ నివారించారని పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనియాడారు. 

Latest Videos

ALso REad:మునుగోడు బైపోల్ 2022: 12 వేల కొత్త ఓట్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

దీనిని నీతి అయోగ్ కూడా మెచ్చుకుని.. నిధులు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసిందని ఆయన గుర్తుచేశారు. కానీ కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీ దొంగ ఓట్లు నమోదు చేయించే ప్రయత్నం చేస్తోందని.... దొంగ ఓట్లను ఈసీ తిరస్కరించడంతో కోర్టులంటూ బీజేపీ డ్రామాలు ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, హుజుర్‌నగర్‌లలో ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీకి డిపాజిట్ రాలేదని పల్లా గుర్తుచేశారు. 

ఇకపోతే... మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.  కొత్తఓటర్ల నమోదుకు సంబంధించి ఈ నెల 21 వ తేదీ లోపుగా పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలను పురస్కరించుకొని  రెండు నెలల వ్యవధిలో  25 వేల మంది కొత్తగా ఓటు హక్కు నమోదుకోసం దరఖాస్తు చేసుకున్నారు.అయితే వీరిలో ఎక్కువ మంది దరఖాస్తులు బోగస్ అని బీజేపీ ఆరోపించింది. ఇదే అభిప్రాయంతో కాంగ్రెస్ కూడా ఉంది.  కొత్తగా నమోదైన ఓటర్లలో అసలు ఓటర్లను తేల్చిన తర్వాతే  ఓటర్ల జాబితా విడుదలకు అనుమతివ్వాలని కోరుతూ బీజేపీ ఈ  నెల 11న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్ పై నిన్న తెలంగాణ  హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు నమోదైన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.  25 వేల మంది కొత్తగా ఓటరు నమోదు కోసం  ధరఖాస్తు చేసుకున్నారు. అయితే 12 వేల దరఖాస్తులకు మాత్రమే అనుమతివ్వాలని కోర్టు ఆదేశించింది. 13 వేల ఓట్లలో 7 వేల ఓట్లను అనుమతించలేదని ఈసీ హైకోర్టుకు తెలిపింది.  మిగిలిన ఆరు వేల ఓట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఈసీ హైకోర్టుకు తెలిపింది.  కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి ఈనెల 21న పూర్తి నివేదికను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఈసీని ఆదేశించింది. కొత్త ఓటరు నమోదు జాబితాను విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని నిన్ననే హైకోర్టు స్పష్టం చేసింది.  

click me!