లిక్కర్ స్కామ్‌పై ఆరోపణలు: బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసిన కల్వకుంట్ల కవిత

By narsimha lodeFirst Published Aug 23, 2022, 12:36 PM IST
Highlights

న్యూఢిల్లీలోని లిక్కర్ స్కామ్ కు సంబంధించిన తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కోర్టుల్లో  కవిత కేసు దాఖలు చేయనున్నారు. 

హైదరాబాద్: న్యూఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు.  ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సాలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ స్కాంతో తనకు సంబంధ: లేకున్నా కూడా తనను అభాసుపాలు చేసే ఉద్దేశ్యంతో బీజేపీ నేతలు ఈ ప్రయత్నాలు చేశారని కవిత సోమవారం నాడు ప్రకటించారు.తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని కూడా కవిత చెప్పారు.తనపై తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కూడా  కవిత ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇందులో భాగంగానే ఆమె ఈ ఇద్దరు నేతలపై పరువు నష్టం దావా వేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  విచారణ నిర్వహించే  దర్యాప్తు సంస్థలకు కూడా తాను సహకరిస్తానని కూడా ఆమె వివరించారు.  తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా పరువు నష్టం దావాలు వేశారు. 

also read:ఎమ్మెల్సీ కవిత ఇల్లు ముట్టడికి బీజేపీ శ్రేణుల యత్నం, ఉద్రిక్తత: అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

ఢిల్లీలోని మద్యం పాలసీ రూపకల్పన కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకు జరిగిందని  బీజేపీ ఆరోపించింది. ఈ విషయమై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను కవిత ఖండించారు. ఈ విషయమై తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మరో వైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే విషయమై కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశారు. ఢిల్లీకి చెందిన మద్యం మాఫియా  ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తేనే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లారని కూడా  ఆయన ఆరోపించారు. 

ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా లక్ష్యంగా  చేసుకున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన మద్యం పాలసీతో వినియోగదారులకు అతి చౌకగా మద్యం దొరుకుతుందని ఆప్ నేతలు చెబుతున్నారు. అయితే మద్యం మాఫియా కోసమే ఈ పాలసీని రూపొందించారని బీజేపీ ఆరోపణలు చేసింది. 

లిక్కర్ స్కాం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ డిమాండ్ తో నిన్న హైద్రాబాద్ లోని కవిత ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.ఈ సమయంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కవిత ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఆందోళనలో పాల్గొన్న బీజేపీ శ్రేణులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ తప్పుబడుతుంది.

 

click me!