
తెలంగాణ శాసనమండలి (Telangana Legislative Council) చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి చైర్మన్ ఎన్నికకు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు కావడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండో సారి బాధ్యతలు చేపట్టారు. మండలి చైర్మన్‌గా ఏకగ్రీవమైన గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీటు వద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గుత్తాకు మంత్రులు పుష్పగుచ్చం అందజేశారు.
ఇక, 2019 సెప్టెంబర్ 11వ తేదీన తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి తొలి సారిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో కూడా ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో.. సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతేడాది జూన్ మొదటి వారం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్‌గా సేవలందించారు. గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో.. ప్రోటెం చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇక, మరోమారు గుత్తా సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ మరోసారి మండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే గతంలో మండలి చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉన్న గుత్తాకు.. మరోసారి మండలి చైర్మన్‌గా ఎన్నుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే శాసనమండలి చైర్మెన్ పదవికి Gutha Sukhendar Reddy ఆదివారం నాడు nomination దాఖలు చేశారు. ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రటరీ ఛాంబర్ లో శాసన మండలి ఛైర్మన్ పదవి కొరకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే మండలి చైర్మన్ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు.