టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో పాటు నలుగురికి సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే బీఎల్ సంతోష్ నేడు సిట్ ఎదుట విచారణకు హాజరవుతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో పాటు నలుగురికి సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్ నోటీసులు జారీ చేసినవారిలో బీఎల్ సంతోష్‌తో పాటు, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, బీడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గు స్వామి ఉన్నారు.
ఇందులో న్యాయవాది శ్రీనివాస్ నేడు సిట్ విచారణకు హాజరయ్యరు. తన లాయర్‌తో కలిసి ఆయన విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు. అయితే మిగిలిన ముగ్గరు నేడు సిట్ ఎదుట విచారణకు హాజరవుతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన కీలక నేత సంతోష్.. విచారణకు హాజరుతారా? లేదా? అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే తెలంగాణ హైకోర్టు.. సిట్ విచారణకు సహకరించాల్సిందిగా బీఎల్ సంతోష్‌కు సూచించిన సంగతి తెలిసిందే. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సిట్‌ను ఆదేశించింది. మరోవైపు తుషార్ కూడా సిట్ విచారణకు హాజరయ్యే అంశంపై తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ముందస్తు బెయిల్ పొందిన తర్వాతే విచారణనకు రావాలనే ఆలోచనలో తుషార్ ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక, బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే విధించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రేమేందర్ రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు.. సిట్ నోటీసులను రద్దు చేసేందుకు నిరాకరించింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సహకరించాల్సిందిగా వారిద్దరినీ ఆదేశించింది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు.. అరెస్ట్ చేయవద్దని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో బీఎల్ సంతోష్‌కు నేరుగా నోటీసులు ఇచ్చేందుకు సహకరించేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ చేపట్టింది. సిట్ నోటీసులు బీఎల్ సంతోష్‌కు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించాలని సూచింది. సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌కు ఇవ్వాల్సిన నోటీసులు ఢిల్లీ పోలీసులకు ఇవ్వాలని.. వారు నోటీసును ఆయనకు సర్వ్ చేస్తారని పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.