వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి, 16 మందికి గాయాలు..

By SumaBala BukkaFirst Published Nov 21, 2022, 8:23 AM IST
Highlights

వనపర్తి జిల్లాలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 16మంది గాయపడ్డారు. 

వనపర్తి : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రివేళ చెరుకు లోడుతో వెడుతున్న ట్రాక్టర్ ను వేగంగా వస్తున్న గరుడ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. 16 మందికి గాయాలయ్యాయి. 

ప్రమాదం జరిగిన సమయంలో గరుఢ బస్సులో 48మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెడుతోంది. మియాపూర్ డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరగా ఈ ఘటన చోటు చేసుకుంది. గరుఢ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతుల్లో డ్రైవర్, క్లీనర్, ఓ ప్రయాణికుడు ఉన్నారు.  

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను, క్షతగాత్రులను అంబులెన్స్ లో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో ముమ్మాళ్లపల్లి నుంచి అమడబాకుల వరకు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 

హైదరాబాదీలకు నిరాశ .. అర్ధాంతరంగా నిలిపోయిన ఇండియా కార్ రేసింగ్ లీగ్

ఇదిలా ఉండగా, బీహార్‌లోని వైశాలి జిల్లాలో అతి వేగంగా వచ్చిన ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు చిన్నారులతో సహా 12 మంది మరణించారు. ఆదివారంనాడు వైశాలి జిల్లా మెహనార్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంపై "తీవ్ర విచారం" వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ..  క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని సంబంధిత అధికారులందరినీ కోరారు. డిప్యూటీ తేజస్వి యాదవ్ కూడా ట్విట్టర్‌లో ఇలా అన్నారు, “భగవంతుడు మరణించిన వారి ఆత్మలకు శాంతిని, వారి కుటుంబాలకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.”

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాదంపై స్పందించారు. "ఇది చాలా బాధాకరమైనది" అన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని హోం వ్యవహారాల సహాయ మంత్రి (MoS) నిత్యానంద రాయ్ ఆకాంక్షించారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ ట్విటర్‌లో ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ (జాప్) అధ్యక్షుడు బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. "కావాల్సిన సాయం అందించడానికి మా కార్యకర్తలు ఘటనాస్థలంలో సిద్ధంగా ఉన్నారు!"

ఈ ఘటనకు సంబంధించి ట్రక్కు డ్రైవర్‌, సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడా లేదా అనేది వైద్య పరీక్షల తర్వాతే నిర్ధారిస్తామని వైశాలి ఎస్పీ తెలిపారు.

click me!