
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుత పరిమాణాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు. ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ పరిధిలో బతకాలని ఆయన అన్నారు.
సింగరేణిలో పనిచేస్తూ ఇంకో దగ్గర పపనిచేస్తానంటే నడవదని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను ఇది లిమిటెడ్ కంపెనీ అని భావిస్తున్నట్లు తెలిపారు. చాలా సమస్యలు ఉన్నాయని, అందుకు తనను అనాల్సిన పనిలేదని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది తనకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాటలు మారిపోయాయని ఆనయ అన్ారు. కలాలూ గళాలూ మౌనంగా ఉంటే క్యాన్సర్ కన్నా ప్రమాదకరమని ఆయన అన్నారు. ప్రతి గాయకుడూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహబూబాబాద్ లో సోమమవారం జరిగిన ప్రముఖ కవి జయరాజ్ తల్లి సంతాప సభలో ఆయన మాట్లాడారు. తాను అధికార పార్ట ఎమ్మెల్యేగా ఉండడం వల్ల తన సహజత్వాన్ని కోల్పోయానని చెప్పారు. ప్రస్తుతం తాను ఓ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానని, తాను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండడం వల్ల చాలా మందికి తాను దూరమయ్యానని రసమయి అన్నారు.
రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనే విషయంపై ఆరా తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రసమయి బాలకిషన్ ధూమ్ ధామ్ పేర సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద యెత్తున నిర్వహించిన విషయం తెలిసిందే.