
హైదరాబాద్: మాజీ మంత్రి పద్మారావు గౌడ్ ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి గెలుపొందిన పద్మారావు గౌడ్ గతంలో మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి కేబినేట్ లో స్థానం దక్కకపోవడంతో డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చెయ్యాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
పద్మారావుగౌడ్ అభ్యర్థిత్వంపై కేసీఆర్ గ్రీన్ సగ్నల్ ఇవ్వడంతో శనివారం శాసనసభ ఉపసభాపతి పదవికి టీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసన సభ ఉపసభాపతి పదవి ఏకగ్రీవం కావాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే మిత్రపక్షమైన ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సంప్రదించింది. అయితే ఎంఐఎం, బీజేపీలు ఏకగ్రీవానికి అంగీకారం తెలపగా కాంగ్రెస్ పార్టీ సూత్రపాయంగా అంగీకారం తెలిపింది. శనివారం నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
ఇకపోతే పద్మారావుగౌడ్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తులలో ఒకరుగా పేరుంది. 2004లో సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఆ తర్వాత కేసీఆర్ కేబినేట్ లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఈసారి కేబినేట్ లో చోటు దక్కకపోవడంతో ఉపసభాపతి పదవిని కట్టబెట్టనున్నారు సీఎం కేసీఆర్.
ఉపసభాపతి పదవికి మాజీమంత్రి పద్మారావుగౌడ్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై శుక్రవారం రాత్రి పద్మారావుగౌడ్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్లు సమాచారం. ఉపసభాపతి పదవికి నామినేషన్ వేసేందుకు శనివారం ఉదయం 9 గంటలకు శాసనసభకు రావాలని సూచించారు.