మంచిమనసున్న ఎమ్మెల్యే మైనంపల్లి... జర్నలిస్ట్ కుటుంబానికి రూ.2లక్షల సాయం

By Arun Kumar PFirst Published Aug 4, 2021, 5:16 PM IST
Highlights

మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆపదలో వున్న జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థికసాయం చేసి ఆదుకున్నారు. 

హైదరాబాద్: ప్రజలకు-ప్రభుత్వానికి వారధిలా నిలిచేది జర్నలిస్టులు. ఇలా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుళ్ళే ఓ జర్నలిస్ట్ కుటుంబానికి కష్టం వస్తే వారికి అండగా నిలిచారు మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. పెద్దదిక్కును కోల్పోయిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ.2లక్షల వ్యక్తిగత సహాయం చేసి పెద్దమనసును చాటుకున్నారు మైనంపల్లి. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ మల్కాజి గిరి నియోజవర్గ పరిధిలోని పనిచేసే జర్నలిస్ట్ శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. దీంతో అతడి భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేనివారు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి సాయం ప్రకటించారు.  

read more  కేసీఆరే మీకు పెద్దదిక్కు... అధైర్యపడొద్దు: బాధిత కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్ భరోసా

టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీతో కలిసి మృతుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే మైనంపల్లి. తీవ్ర బాధలో వున్న ఆ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి తన సానుభూతి తెలిపి ఓదార్చారు. మృతుడు శ్రీనివాస్ పిల్లలిద్దరికి చెరో లక్ష రూపాయల చొప్పున తన వ్యక్తిగత ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు మైనంపల్లి . దీంతో పాటుగా ఇద్దరు పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

అంతేకాకుండా టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ తో మాట్లాడి ఈ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లును మంజూరీ చేస్తానని భరోసానిచ్చారు. మృతుని భార్యకు ఏదయినా ఉపాధి కూడా కల్పించేందుకు చర్యలు చేపడతామని ఎమ్యెల్యే మైనంపల్లి హామీ ఇచ్చారు. 

జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిన మైనంపల్లి హన్మంత రావుకు టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా శాఖ అధ్యక్షుడు మోతె వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బాల్ రాజ్, సహాయ కార్యదర్శి వెంకటేష్, యూనియన్ కాప్రా, మల్కాజిగిరి  నాయకులు విజయ్, తేజ, మహేష్, లక్ష్మారెడ్డి, మల్లేష్ గౌడ్, పవన్, మనోహర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

click me!