ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఈ పథకంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తప్పుడు విధానాల ఫలితంగా దేశం అధోగతి పాలవుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద గౌడ్ ఆరోపించారు. ప్రదాని నరేంద్ర మోడీ, ఆయన అనుచరుల అనాలోచిత విధానాల ఫలితంగానే దేశంలో ఆందోళనలు పెచ్చు మీరుతున్నాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ విధానాలపై ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారని... ఆ హెచ్చరికలు ఇపుడు నిజం అవుతున్నాయని ఎమ్మెల్యే వివేకా పేర్కొన్నారు.
ఆర్మి రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై చెలరేగుతున్న ఆందోళనలపై ఎమ్మెల్యే స్పందించారు. బిజెపి ప్రభుత్వం తెచ్చింది అగ్నిపథ్ కాదు ఆవారా పథ్ అంటూ మండిపడ్డారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారన్నారు. కాబట్టి విద్యార్థుల ఆందోళనను గుర్తించి ప్రదాని మోడీ తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
undefined
రక్షణ శాఖలో ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకొచ్చిన మోడీ ఇపుడు అగ్నిపథ్ తో కాంట్రాక్టు విధానం తెచ్చారన్నారు. దీన్ని యువత అంగీకరించడం లేదని... వెంటనే ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారన్నారు. మోడీ ఏదీ చేసినా ఆరంభ శూరత్వమే అని వరసగా జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయని వివేకానంద అన్నారు.
''గతంలో నల్లదనాన్ని దేశానికి తీసుకువస్తామంటూ నోట్ల రద్దు చేసారు. దీంతో నల్లదనం రాకపోగా కొత్తగా దొంగ నోట్ల సమస్య ఎక్కువయ్యింది. స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు పొగవుతూనే వుంది. తాజా నివేదికల్లో కూడా స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్న భారతీయుల సంఖ్య పెరిగిందని సమాచారం ఉంది. మోడీ విధానాలతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బ తింటోంది'' అని వివేకా ఆరోపించారు.
''నల్ల వ్యవసాయ చట్టాలతో రైతులను ఇబ్బంది పెట్టి చివరకు పీఎం క్షమాపణ చెప్పారు. ఇలా రైతులకు సారీ చెప్పినట్టే యువతకు అగ్ని పథ్ విషయంలో క్షమాపణ చెప్పాలి. దేశంలో తిరుగుబాటు మొదలైందని... ఇకపై మోడీకి, బీజేపీ గడ్డు రోజులే. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కి నిరసన సెగలు తాకుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రదాని తన విధానాలు సమీక్షించుకోవాలి'' అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సూచించారు.
''తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో భారీగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో ప్రైవేట్ రంగంలో కూడా భారీగా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇలా ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు'' అని వివేకా తెలిపారు.
''తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు పోరాటం చేస్తే కేంద్రంపై చేయాలి.. రాష్ట్రంపై కాదు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఆయన చదువుతారు'' అని ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు.
మరో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ... అగ్నిపథ్ పథకం దేశంలో అగ్గి రాజేసిందన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనలపై బండి సంజయ్ తెలివి లేకుండా మాట్లాడుతున్నారని... ఈ రైల్వే స్టేషన్ కేంద్రం ఆదీనంలోని రైల్వే పోలీసుల ఆధీనంలో ఉంటుందన్నారు. కాబట్టి సికింద్రాబాద్ స్టేషన్లో జరిగిన ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. రైతులను నష్టపరిచిన నల్ల చట్టాల పై మోడీ వెనక్కి తగ్గినట్టే అగ్నిపథ్ పై కూడా తన వెనక్కి తగ్గాలని కాలేరు వెంకటేశ్ డిమాండ్ చేసారు.