ఎన్నికలకు ముందే పొత్తు‌లకు సై అంటున్న టీఆర్ఎస్!.. ఆ నేతల్లో మొదలైన కలవరం..?

By Sumanth KanukulaFirst Published Aug 25, 2022, 10:17 AM IST
Highlights

తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త వ్యుహాన్ని అవలంభించే అవకాశం ఉంది. ముందుగానే పొత్తులు ఏర్పాటు చేసుకుని.. ఎన్నికల బరిలో నిలవాలని టీఆర్ఎస్ అధిష్టానంల ఆలోచిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త వ్యుహాన్ని అవలంభించే అవకాశం ఉంది. ముందుగానే పొత్తులు ఏర్పాటు చేసుకుని.. ఎన్నికల బరిలో నిలవాలని టీఆర్ఎస్ అధిష్టానంల ఆలోచిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పొత్తులతోనే ముందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2004 లో కాంగ్రెస్, వామపక్షాలతో, 2009లో టీడీపీ, వామపక్షాలతో.. టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే 2004లో కాంగ్రెస్‌, వామపక్షాలతో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ముందు పొత్తు బాగానే పని చేయగా, 2009లో టీడీపీ, వామపక్షాలతో జతకట్టడంతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి ఉంది. అయితే 2014లో తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి టీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. అన్ని ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసింది. 

మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై వామపక్షాలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీపీఐ.. టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నట్టుగా ప్రకటించింది. భవిష్యత్తులో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలిపింది. మునుగోడులో సీపీఎం కూడా గులాబీ పార్టీకే మద్దతిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆ చర్చల సమయంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పొత్తుల అంశంపై కూడా టీఆర్‌ఎస్ నాయకత్వం, వామపక్ష పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు పొత్తులో భాగంగా తమకు  వదిలిపెట్టాల్సిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను సీపీఐ, సీపీఎం నేతలు సమర్పించినట్లుగా సమాచారం. దీనిపై టీఆర్‌ఎస్ అధిష్టానం సానుకూలంగా స్పందించి మునుగోడు ఉప ఎన్నికల తర్వాత చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ చేసింది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ స్థానాలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, హైదరాబాద్‌లోని నాంపల్లి, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ స్థానాలను సీపీఐ కోరినట్టుగా సమాచారం. 

ఇదిలా ఉంటే.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో తమ పార్టీకి బలమైన క్యాడర్ బేస్ ఉందని భావించే ఏడెనిమిది స్థానాలను సీపీఎం కోరినట్లు సమాచారం. అయితే ఈ స్థానాలలో చాలా వరకు ప్రస్తుతం టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వామపక్షాల ఎత్తుగడలతో అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. టీఆర్ఎస్ నాయకత్వం తమ స్థానాలను వామపక్షాలకు వదిలివేస్తే తమ పరిస్థితి ఏమిటని?.. రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

గత శనివారం మునుగోడులో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. విభజన శక్తులను ఓడించేందుకు రానున్న ఎన్నికల్లో వామపక్షాలు, ఇతర ప్రగతిశీల శక్తులతో కలిసి పనిచేసేందుకు టీఆర్‌ఎస్ సుముఖంగా ఉందన్నారు. అది మునుగోడు ఉప ఎన్నికలకే పరిమితం కాదని చెప్పారు. దీంతో ఆయన 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలకు ముందే పొత్తులు ఏర్పాటు చేసుకోనున్నారనే వార్తలకు మరింత బలం చేకూర్చినట్టయింది. 
 

click me!