కార్పొరేటర్ సింధును ప్రగతిభవన్ కు పిలిచిన కేసీఆర్.. కారణమదేనా?

By AN TeluguFirst Published Dec 5, 2020, 2:33 PM IST
Highlights

బల్దియా ఎన్నికలు అయిపోయాయి... ఇక ఇప్పుడు మేయర్ ఎవరు అనే దానిచుట్టే చర్చమొత్తం నడుస్తోంది. ఈసారి మేయర్ సీటు మహిళలకు కేటాయించడంతో ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

బల్దియా ఎన్నికలు అయిపోయాయి... ఇక ఇప్పుడు మేయర్ ఎవరు అనే దానిచుట్టే చర్చమొత్తం నడుస్తోంది. ఈసారి మేయర్ సీటు మహిళలకు కేటాయించడంతో ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కొత్త మహిళా మేయర్‌ ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరించినప్పటికీ, 31 మంది ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం గులాబీ పార్టీకి ఉన్నప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌ 98ను అందుకోలేదు.  

ఈ నేపథ్యంలో ఇతరుల మద్దతు కూడగట్టుకొని మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలి. అయితే టీఆర్‌ఎస్‌ నుంచి ఈ అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో పలు పేర్లు వినిపిస్తున్నాయి. 

అయితే శుక్రవారంనాడు భారతీనగర్‌ డివిజన్‌ నుంచి గెలిచిన వి.సింధును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. దాంతో ఆమెనే మేయర్‌ పీఠం వరించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే  మేయర్ పీఠం ఆశావహుల్లో రెండుసార్లు గెలిచినవారూ ఉన్నారు. 

టీఆర్‌ఎస్‌ నాయకుడు మన్నె గోవర్థన్‌రెడ్డి భార్య, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి పేర్లు మేయర్ రేసులో ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. 

వీరంతా రెండో సారి గెలిచినవారే. వీరితోపాటు ప్రస్తుత మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి పేరు కూడా వినిపిస్తోంది. ఈసారి మేయర్‌ సీటు జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో ఓసీల నుంచే అవకాశం కల్పించనున్నారని బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సింధును పిలవడం ఇందుకు ఊతమిస్తోంది.  జీహెచ్‌ఎంసీగా అవతరించాక జరిగిన తొలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచి మహిళా మేయర్‌గా కార్తీకరెడ్డి బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. 
 

click me!