
కోదాడ: టీఆర్ఎస్ పార్టీలో సీట్ల లొల్లి నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. అసంతృప్తులను బుజ్జగించడం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారింది. సీట్ల కేటాయింపులో తమ అభ్యర్థికి అన్యాయం జరిగిందంటూ కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలే చెన్నూరు అసెంబ్లీ సీటును ఓదేలుకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గట్టయ్య అనే కార్యకర్త కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చివరకు చనిపోయాడు.
ఆఘటన మరువకముందే సూర్యాపేట జిల్లా కోదాడలో ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లాలో సీఎం బహిరంగ ఏర్పాట్లలో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని వర్గపోరు బహిర్గతమైంది. తమ నాయకుడు శశిధర్ రెడ్డికే టిక్కెట్ ఇవ్వాలంటూ ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సీఎం కేసీఆర్ బహిరంగసభకు జనసమీకరణ కోసం కోదాడలో టీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాము అనే టీఆర్ఎస్ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తోటి కార్యకర్తలంతా అడ్డుకోవడంతో పెద్దప్రాణగండం తప్పింది.
ఈ ఘటన ఇంకా మరువకముందే కొద్దిసేపటికే తెలుగుతల్లి విగ్రహం వద్ద మరో కార్యకర్త కిరోసిన్ పోసుకున్నాడు. శశిధర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అయితే కోదాడ టిక్కెట్ ను శశిధర్ రెడ్డి, చందర్‌రావు ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గం అభ్యర్థిని ఇంకా కేసీఆర్ ప్రకటించలేదు. అయితే టికెట్‌ను శశిధర్ రెడ్డికే కేటాయించాలంటూ అభిమానులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.