కారును పోలిన గుర్తులొద్దు: రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు

By narsimha lodeFirst Published Nov 16, 2020, 8:53 PM IST
Highlights

: కారు గుర్తును పోలిన గుర్తులతో తమకు నష్టం వాటిల్లుతోందని టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.


హైదరాబాద్: కారు గుర్తును పోలిన గుర్తులతో తమకు నష్టం వాటిల్లుతోందని టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.

సోమవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ తో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భరత్ భేటీ అయ్యారు. గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో చోటు చేసుకొన్న ఉదంతాలను నేతలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కారు గుర్తుగా భావించి అదే గుర్తును పోలిస గుర్తుపై నిరక్షరాస్యులు ఓట్లు వేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.

అదే విధంగా సోషల్ మీడియా దుష్ప్రచారంపై నిఘా పెట్టాలని కూడ వారు కోరారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన ఇతర గుర్తుల వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారన్నారు. దీని వల్ల టీఆర్ఎస్ కి తీరని నష్టం జరుగుతోందని ఆయన తెలిపారు.

గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆటో, ట్రక్కు, రోడ్ రోలర్ వంటి గుర్తుల వల్ల తమ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఆ గుర్తులను తొలగించారని ఆయన గుర్తు చేశారు.

ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రోటీ మేకర్ గుర్తు కూడా టీఆర్ఎస్ పార్టీకి నష్టాన్ని కలిగించిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.ఇలాంటి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు పోలిన గుర్తులను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కోరినట్లు వినోద్ కుమార్ తెలిపారు.

గత ఆరేళ్లుగా శాంతి భద్రతల విషయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే మెరుగైన నగరంగా నిలిచిందని వినోద్ కుమార్ తెలిపారు. దేశ నలు మూలలకు చెందిన ప్రజలు హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా జీవిస్తున్న విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్న దుష్ప్రచారంపై నిఘా ఉంచాలని కోరారు. దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కోరారు.

సోషల్ మీడియా ద్వారా కొన్ని శక్తులు సామాజికంగా విద్వేషాలను రెచ్చ గొడుతున్నాయన్నారు.తప్పుడు సమాచారంతో గందరగోళం సృష్టిస్తున్నాయని వినోద్ కుమార్ చెప్పారు. ఇలాంటి ముఠాలపై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.


 

click me!