
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు (GO 317) నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) దీక్షకు దిగడం.. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన కేసులు నమోదం చేయడం, కోర్డు 14 రోజులు రిమాండ్ విధించడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ పరిణామాలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి ముఖ్యంగా టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు (TRS Leaders) ఈ పరిణామాలపై అంతర్గత సంభాషణలలో తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్‌ను కూడా ప్రస్తావిస్తున్నారు. అసలు ఇంతకీ టీఆర్‌ఎస్ నాయకుల అంతర్గత సంభాషణల్లో ఏం చర్చ సాగుతుందో ఒక్కసారి చూద్దాం..
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి చిట్టా తీశామని.. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతామని బీజేపీ నేత బండి సంజయ్ హెచ్చరించారు. పలు వేదికలపై నుంచి సంజయ్ ఇదే రకమైన కామెంట్స్ చేశారు. సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు కూడా ఇదే రకమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ శ్రేణులు కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చాయి. కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని సంజయ్‌ను టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే హుజురాబాద్‌లో బీజేపీ తరఫున బరిలో నిలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో ఆ తర్వాత చర్చ మొత్తం ఈటల చుట్టే సాగింది. ఈ క్రమంలోనే ఈటలపై కామెంట్స్ చేయని.. కేసీఆర్ బండి సంజయ్‌ను టార్గెట్ చేసుకని విమర్శలు కురిపించారు. ప్రగతి భవన్‌లో వరుస ప్రెస్ మీట్లలో బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. తనని జైలుకి పంపుతా అని బండి సంజయ్ అంటున్నాడని.. అంత ధైర్యం ఉన్నవాళ్లు ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిదంటున్న బండి సంజయ్ దమ్ముంటే తన మీద కేసు పెట్టాలని సవాలు విసిరారు. ఆ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటకు వెళ్లిన బండి సంజయ్ వాహనంపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేశారు.
Also Read: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ: 14 రోజుల రిమాండ్ విధించిన కరీంనగర్ కోర్టు
అప్పటి నుంచి టీఆర్‌ఎస్ వర్సెస్ బండి సంజయ్‌గా సీన్ మారింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ 317 జీవోకు నిరసగా దీక్షకు దిగడం.. ఆ తర్వాత అరెస్ట్ అవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ అధినేతను జైలుకు పంపిస్తానని పదే పదే చెప్పిన బండి సంజయ్.. ఇప్పుడు తానే వెళ్లి జైలులో కూర్చొన్నాడని టీఆర్‌ఎస్ నాయకులు అంతర్గతంగా చర్చించుకున్నట్టుగా తెలిసింది. ఇన్ని రోజులు ఎగిరిపడ్డ సంజయ్‌కు.. కేసీఆర్ అంటే ఎమిటో చూపించారని కూడా కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. కొందరు టీఆర్‌ఎస్ అగ్రశ్రేణి నాయకులు కూడా తమ క్యాడర్‌తో ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న టాక్.
ఇక, టీఆర్‌ఎస్ కార్యకర్తల విషయానికి వస్తే బండి సంజయ్ జైలుకు వెళ్లడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ప్రజా సేవలో ఉన్న ఉద్యోగుల విధులకు అటంకం కలిగించడం.. వంటి కేసులపై సంజయ్‌ను అరెస్ట్ చేసినట్టుగా టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. లోపల మాత్రం ఈ పరిణామాలను టీఆర్‌ఎస్ శ్రేణులు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారని భోగట్ట. పలువురు టీఆర్‌ఎస్ మద్దతుదారులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కూడా ఇదే విధంగా ఉంటున్నాయి.
అయితే కక్ష సాధింపులో భాగంగానే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని.. బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. బెంగాల్‌లో మాదిరిగా తెలంగాణలో బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని వారు అంటున్నారు. బండి సంజయ్ అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.
రాజకీయ విశ్లేషకులు మాత్రం..
అయితే బండి సంజయ్ అరెస్ట్, గత కొంతకాలంగా తెలంగాణ చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం.. కేసీఆర్ ఈ రకంగా వ్యవహరించడం వెనక బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఈటల రాజేందర్ పేరు జనాల్లో నానకుండా బండి సంజయ్ వైపు దృష్టి మళ్లించడం.. తద్వారా ఈటల ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడం ఒకటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న బండి సంజయ్‌ను జైలుకు పంపడం ద్వారా.. మిగిలిన నాయకులకు కేసీఆర్ అంటే తెలిసేలా వ్యుహా రచన చేసి ఉంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుత పరిణామాలు తర్వాత కాలంలో ఏ రకమైన మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.