టీఆర్ఎస్ అభ్యర్థిని నేనే: కౌశిక్ రెడ్డిపై వకుళాభరణం కృష్ణమోహన్ మండిపాటు

By telugu teamFirst Published Jul 12, 2021, 12:19 PM IST
Highlights

హుజూరాబాద్ టీఎర్ఎస్ అభ్యర్థిని తానేనంటూ కాంగ్రెసు నేత కౌశిక్ రెడ్డి చెప్పుకోవడంపై టీఆర్ఎస్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్ మండిపడ్డారు. ఇంకా టీఆర్ఎస్ అభ్యర్థిపై నిర్ణయం జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని తానెనంటూ చెబుకున్న కాంగ్రెసు నేత కౌశిక్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత వకుళాభరణం కృష్ణమోహన్ మండిపడ్డారు. హుజూరాబాద్ పార్టీ అభ్యర్థిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఆయన స్ఫష్టం చేశారు. పార్టీ అభ్యర్థిని పార్టీ నాయకత్వం ధ్రువీకరించలేదని ఆయన చెప్పారు. 

తానే పార్టీ అభ్యర్థిని అంటూ కౌశిక్ రెడ్డి ప్రకటించుకోవడం ఏమిటని ఆయన అడిగారు. అయినా కౌశిక్ రెడ్డి కాంగ్రెసు పార్టీ సభ్యుడని, ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఎలా ఇస్తారని వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. ఎవరికి వారే తానే పార్టీ అభ్యర్థినని ప్రకటించుకునే టీఆర్ఎస్ లో లేదని ఆయన చెప్పారు. 

పార్టీ అభ్యర్థిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని, కేసీఆర్ నిర్ణయం తమందరికీ శిరోధార్యమని ఆయన చెప్పారు. 

కాగా, పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు అందుకున్న హుజూరాబాద్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారు. ఆయన రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇదిలావుంటే, తమ పార్టీ హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డికి తెలంగాణ పీసీసీ నోటీసులు జారీ చేసింది. హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి చెప్పిన మాటల ఆడియో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ పీసీసీ నోటీసులు ఇచ్చింది. వచ్చే 24 గంటలలోగా వివరణ ఇవ్వాలని పీసీసీ ఆయనను ఆేదశించింది. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పీసీసీ కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా కౌశిక్ రెడ్డిని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం హెచ్చరించింది. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కౌశిక్ రెడ్డి రహస్య మంతనాలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

దాంతో కౌశిక్ రెడ్డి కాంగ్రెసుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ బిజెపిలో చేరారు. బిజెపి తరఫున ఆయన హుజూరాబాద్ నుంచి పోటీ చేయడం ఖాయమైంది. 

ఇప్పటి వరకు టీఆర్ఎస్ తన హుజూరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆ పార్టీ నాయకత్వం అభ్యర్థి వేటలో ఉంది. దీంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన గతంలో కాంగ్రెసు తరఫున ఈటల రాజేందర్ మీద పోటీ చేశారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహిత బంధువు. 

click me!