
టీఆర్ఎస్ (trs) సీనియర్ నేత , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన ఖమ్మం జిల్లాలో (khammam district) పర్యటించారు. అది సాధారణ పర్యటనేనని అంతా భావించారు. అయితే జూపల్లి టీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలావుండగానే.. కొల్లాపూర్ నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది. నియోజకవర్గ ప్రజలతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, ఏ నిర్ణయం తీసుకున్నా.. కార్యకర్తలకు మంచి జరుగుతుందని జూపల్లి వ్యాఖ్యానించారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరానని జూపల్లి గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని ఆయన తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్న ఆయన తన భవిష్యత్తు ముఖ్యం కాదన్నారు. జూపల్లి అంటే సేవాభావంతో కూడిన రాజకీయం చేస్తాడని కృష్ణారావు అన్నారు. కొంతమంది బెదిరింపు రాజకీయం చేస్తున్నారని, ఎవరూ భయపడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్న ఆయన.. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొంగులేటిని
కాంగ్రెసు, బిజెపి సంప్రదిస్తున్నాయని.. అయితే టీఆర్ఎస్ తనకు టికెట్ ఇస్తుందని భావిస్తున్నానని జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి Jupally krishna rao పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి Harshavardhan reddy చేతిలో ఓటమి పాలయ్యాడు. అయితే హర్షవర్ధన్ రెడ్డి Congressను వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య పోరు సాగుతుంది. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు తన అభ్యర్ధులను గెలిపించుకొన్నారు. ఈ పరిణామాలపై TRS నాయకత్వం సీరియస్ అయింది.
పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన వారే ఎంపీపీలుగా ఉన్నారు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో జూపల్లి వర్గానికి చెందిన వారికి టీఆర్ఎస్ బీ ఫాం లు ఇచ్చారు. అయితే విజయం సాధించినా కూడా వీరంతా జూపల్లి వర్గంగానే కొనసాగుతున్నారు. ఇటీవలనే ఖమ్మంలో టీఆర్ఎస్ లో అసమ్మతి వర్గంగా ఉన్న నేతలతో జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలోని తన అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూపల్లి కృష్ణారావు త్వరలోనే ఓ జాతీయ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతుంది. బీజేపీ వైపు జూపల్లి కృష్ణారావు చూస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇదే విషయాన్ని తన అనుచరులకు జూపల్లి కృష్ణారావు సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు.