
హైదరాబాద్: పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతోనే తాను పార్టీకి దూరంగా ఉంటున్నానని మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy చెప్పారు.పార్టీలో మొదటి నుండి ఉన్న వారికే పదవులు ఇవ్వాలని ఆయన కోరారు. శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన కోరారు. TDP నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే ఏం లాభమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.పార్టీలో అంతర్గతంగా తనకు ఎవరితో విబేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కెపాసిటీ ఉన్నోళ్లకు పదవులు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. ఇలా చేయకపోతే పాత కాంగ్రెస్ నేతలు దూరమౌతారని ఆయన అభిప్రాయపడ్డారు.
సింగరేణి టెండర్లు పారదర్శకంగా జరగలేదని తాము ప్రశ్నిస్తే మంత్రి జగదీష్ రెడ్డి తమపై నిందలు వేయడాన్ని రాజగోపాల్ రెడ్డి తప్పు బట్టారు. ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో BJP లో చేరుతారని కూడా ప్రచారం సాగింది. తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఓ పార్టీ నాయకుడితో రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టుగా ప్రచారమైన ఆడియో సంభాషణ గతంలో వైరల్ గా మారింది. బీజేపీలో చేరుతానని తనపై వస్తున్న ప్రచారాలు ఒట్టివేనని కూడా ఆయన మరోసారి ప్రకటించారు.
రెండు రోజుల క్రితం బీజేపీ నేత Vivek తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత లేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తమ మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.