ఈటెల ఎఫెక్ట్: గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గుడ్ బై

By telugu teamFirst Published May 29, 2021, 7:56 AM IST
Highlights

మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వెంట నడిచేందుకు ఆయన సిద్ధపడ్డారు. ఈటెల కోటరీలో ఒక్కడిగా మారారు.

కామారెడ్డి: మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు దూరమవుతారని సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆయన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వెనక నడుస్తున్నారు. 

ఈటెల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయినప్పటి నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీకి మరింత దూరమయ్యారు. ఈటెల రాజేందర్ కోటరీలో ఒకరిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడమా, బిజెపిలో చేరడమా అనే ఆలోచనలో ఉన్న ఈటె రాజేందర్ నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈటెల రాజేందర్ వెంటే ఉండాలని ఏనుగు రవీందర్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఈటెల రాజేందర్ దాదాపుగా బిజెపిలో చేరుతారనే ప్రచారం ముమ్మరమైంది. అందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. ఈటెలతో పాటు రవీందర్ రెడ్డి కూడా బిజెపిలో చేరుతారు. దీంతో ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. 

2018 ఎన్నికల్లో ఓటమి పాలైన ఏనుగు రవీందర్ రెడ్డి తనకు నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించారు అయితే, కాంగ్రెసు నుంచి గెలిచి జాజాలా సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. దాంతో ఎల్లారెడ్డి నియోజకవర్గం బాధ్యతలను టీఆర్ఎస్ నాయకత్వం సురేందర్ కు అప్పగించింది. దాంతో ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. 

టీఆర్ఎస్ నాయకత్వం తననూ తన అనుచరులను పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదులో కూడా ఏనుగు రవీందర్ రెడ్డికి ఏ విధమైన పాత్ర లేకుండా చేశారు. దాంతో ఆయన ఈటెల వెంట నడవడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. 

click me!