ప్చ్.. కవితక్కకు చాన్స్ మిస్ !

First Published Mar 17, 2017, 11:02 AM IST
Highlights

రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలు లేని లేటు ఎలాగూ కనిపిస్తోంది. కనీసం రాష్ట్రం నుంచి ఓ మహిళ కేంద్ర మంత్రిగా ఉంటుందన్న ఆశను బీజేపీ విజయం దూరం చేసింది.

ఉత్తరాది ఎన్నికల్లో అద్భుతం విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో దక్షణంపై ఆ పార్టీ దృష్టి సారించింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే పనిలో పడింది.

 

ముఖ్యంగా మనోహర్ పారికర్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయడం,  హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ సీఎం అవడానికి ఆసక్తి చూపుతుండటం, సుష్మా స్వరాజ్ అనారోగ్యంగా ఉండటంతో పునర్ వ్యవస్థీకరణ తప్పేలా లేదు.

 

వారి స్థానంలో ఎవరిని మంత్రిమండలిలోకి తీసుకుంటారనే చర్చ మొదలైంది. బీజేపీ మిత్రపక్షంలో చాలా మంది ఇప్పుడు మంత్రి వర్గవిస్తరణలో తమకు చోటిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

బీజేపీ మిత్రపక్షం కాకున్నా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతరు ఎంపీ కవిత కూడా రేసులో ఉన్నట్లే అని అందరూ భావిస్తున్నారు.

 

ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ నిర్ణయాన్నిస్వాగతించడంతో కారు, కమలం దోస్తీ కడుతాయని అందరూ భావించారు. కవితకు కేంద్ర మంత్రి పదవి ఖాయం అని అనుకున్నారు.  కానీ, ఇటీవల ఉత్తరాది ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ రూటు మారింది.

 

ఉత్తరాదిని కషాయం చేసిన బీజేపీ ఇప్పుడు తన లక్ష్యాన్ని దక్షణంపై గురిపెట్టింది. అందులోనూ 2019 లో తెలంగాణలో జెండా పాతడమే లక్ష్యంగా బీజేపీ చీఫ్ అమిత్ షా ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో కారు కమలం కలిసీ దోస్తీ చేస్తాయి. వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తాయి అనే ఊహగానాలకు తెరపడినట్లే. అలాగే, సీఎం కేసీఆర్ ముస్లిం ఓట్లను ఆకర్షించే పనిలో రిజర్వేషన్ల అంశం పైకి తీసుకరావడం బీజేపీకి అసలే ఇష్టం లేదు. ఈ అంశం భవిష్యత్తులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వైరానికి కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో ఎంపీ కవిత కేంద్ర మంత్రి పదవి కల కల్లలయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలు లేని లేటు ఎలాగూ కనిపిస్తోంది. కనీసం రాష్ట్రం నుంచి ఓ మహిళ కేంద్ర మంత్రిగా ఉంటుందన్న ఆశను బీజేపీ విజయం దూరం చేసిందని చెప్పొచ్చు.

 

click me!