మునుగోడు బై పోల్: క్షేత్ర స్థాయిలో ఓటర్లపై గులాబీ పార్టీ ఫోకస్.. ఆ ప్రయత్నాలు గెలుపుకు హెల్ప్ కానున్నాయా?

By Sumanth KanukulaFirst Published Oct 5, 2022, 12:06 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నికను టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలకు ముందు నుంచే మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుతుపుతున్న సంగతి తెలిసిందే. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తుంది. 

మునుగోడు ఉపఎన్నికను టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, 2018లో మాత్రం అక్కడ ఓడిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. అయితే మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేయగా.. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవనున్నారు. టీఆర్ఎస్ బుధవారం రోజున ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. 

అయితే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌కు ముందు నుంచే మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుతుపుంది. ఈ క్రమంలోనే  క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తుంది.  నియోజకవర్గంలో మండలాల వారీగా వారం రోజుల పాటు ‘సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమం’ చేపట్టిన టీఆర్ఎస్..  ఆ సందర్భంగా వారికి ప్రభుత్వ పథకాలను వివరించింది. ఈ కార్యక్రమం ద్వారా టీఆర్ఎస్‌కు కొంత మైలేజ్ వచ్చిందనే ప్రచారం సాగుతుంది. 

కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలు, ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన గుణాత్మక మార్పులను ఓటర్లకు వివరించడం.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ విజయానికి దోహదపడుతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా తర్వాత పార్టీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. రాజ్‌గోపాల్ కంటే టీఆర్ఎస్‌ మునుగోడులో ముందు ఉందనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. 

దసరా పండగ తర్వాత.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో సహా పెద్ద మొత్తంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మునుగోడుకు వెళ్లనున్నారు. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంలో కీలకంగా వ్యవహరించిన జగదీష్ రెడ్డి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడూ సీఎం కేసీఆర్‌కు నివేదికలు సమర్పిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. మునుగోడులో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి.. క్షేత్ర స్థాయిలోకి ప్రచారాన్ని తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్స కవిత ప్రమేయం ఉందన్న ఆరోపణలను, అధికార పార్టీ నేతలతో అనుబంధంగా ఉన్న కంపెనీలపై కేంద్ర ఏజెన్సీలు ఇటీవల జరిపిన దాడులను ప్రధానంగా ప్రస్తావించాలని బీజేపీ చూస్తోంది. తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలనను, కుటుంబ పాలనను తరిమికొట్టాలనే నినాదంతో బీజేపీ ముందుకు సాగుతుంది. 

కాంగ్రెస్ విషయానికొస్తే.. ముందుగానే పాల్వాయి స్రవంతిని తన అభ్యర్థిగా ఎంపిక చేయడం వల్ల అక్కడ ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్రవంతికి కాంగ్రెస్ నాయకులతో పాటు సాధారణ ప్రజలతో ఉన్న అనుబంధం.. నియోజకవర్గ అభివృద్దికి ఆమె తండ్రి సహకారం ఆ పార్టీకి సానుకూల అంశాలుగా పరిగణించబడుతున్నాయి. ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మాదిరిగా ఆమె డబ్బు ఖర్చు చేసే అవకాశం లేదని.. ఇది కాంగ్రెస్‌కు ప్రతికూల అంశమని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. 
 

 

click me!