టిఆర్ఎస్ వాళ్లు మరీ ఇట్ల తయారైర్రు ఎందుకో ?

First Published Feb 8, 2018, 2:03 PM IST
Highlights
  • అధికార పార్టీ ఫ్లెక్సీల్లో గవర్నర్, కలెక్టర్ ఫొటోలు
  • పరిధి దాటి రెచ్చిపోతున్న అధికార పార్టీ శ్రేణులు
  • రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నవారికి తలనొప్పులు

తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లుగా అధికార పార్టీగా టిఆర్ఎస్ కొనసాగుతోంది. తెలంగాణ సాధించడంతోపాటు తొలిసారి తమ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో టిఆర్ఎస్ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అయితే అధికార పార్టీ నేతలుగా బాధ్యతతో ఉండాలి. కానీ ఉద్యమ కాలంనాటి వాసనలు ఇంకా టిఆర్ఎస్ నేతలు వదులకోలేకపోతున్నారు. దీంతో కింది స్థాయిలో నాయకులు, కార్యకర్తలు చేస్తున్న వ్యవహారాలు పార్టీ అగ్రనేతలకు తలనొప్పులు తెస్తున్నాయి.

అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా.. ఏ రాజకీయ పార్టీ అయినా.. రాజకీయ వసూళ్లు.. దందాలు, పైరవీలు, బెదిరింపులు, భూ కబ్జాలు చేయడం సహజమే. పైకి అలాంటివేం చేయడంలేదని సుద్దపూసల మాదిరిగా చెబుతారు. కానీ దేశమంతా అదే తంతు నడుస్తున్నది. ఇందులో ఏ పార్టీకి మినహాయింపు కాదు. ఇది తప్పని తెలిసి కూడా రాజకీయ నేతలు అదే పని చేస్తుంటారు.

ఇక ఈ వ్యవహారాలలో అన్ని పార్టీల మాదిరిగానే టిఆర్ఎస్ కూడా తక్కువేమీ తినలేదు. ఇవేకాకుండా ఇటీవల టిఆర్ఎస్ నేతలు చేసిన ఒక పని మరీ విచిత్రంగా ఉంది. సోషల్ మీడియాలో వారి చేసిన దానిపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇంతకూ టిఆర్ఎస్ నేతలు ఏం చేశారంటే..? పార్టీ ముఖ్య నేతల ఫొటోలతో పాటు తమ ఫొటోలు వేసుకుని ఫ్లెక్సీలు కొట్టించడం సహజంగానే జరుగుతుంటుంది. అయితే కొందరు టిఆర్ఎస్ నేతలు మాత్రం ఒక అడుగు ముందుకేసి తమ ఫ్లెక్సీల్లో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ నరసింహన్ ఫొటో వేసుకున్నారు. గవర్నర్ కు గులాబీ రంగు పులిమారు. అంతేకాదు వరంగల్ జిల్లాలో అయితే ఏకంగా టిఆర్ఎస్ ఫ్లెక్సీలో జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఫొటోను, జిల్లా వ్యవసాయాధికారి ఫొటోను టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలో పొందుపరిచారు.

వరంగల్ పట్టణంలో ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వరరావు రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆయన స్వగ్రామం నర్సక్కపల్లి గ్రామంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సిఎం కేసిఆర్, స్పీకర్ మధుసూదనాచారి, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితోపాటు జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, జిల్లా వ్యవసాయాధికారి ఉషా దయాల్ ఫొటోలను కూడా కలిపి ప్రింట్ కొట్టించారు.

అలాగే నల్లగొండ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ మల్కాపురం గ్రామ శాఖ వారు ఏకంగా గవర్నర్ నరసింహన్ ఫొటోను పార్టీ ఫ్లెక్సీలో ముద్రించి సంచలనం సృష్టించారు. నల్లగొండ జిల్లాలో గవర్నర్ పర్యటన సందర్భంగా ఆయన ఫొటోను పార్టీ ఫ్లెక్సీలో పొందుపరిచారు. సిఎం కేసిఆర్ ఫొటోతోపాటు గవర్నర్ ఫొటో, మంత్రి జగదీష్ రెడ్డి ఫొటో, భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫొటోలను ముద్రించారు. అలాగే స్థానిక నాయకులంతా తమ ఫొటోలను కూడా అందులో ఉంచారు

ఇలా పార్టీ ఫ్లెక్సీల్లో అధికారులు, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నవారి ఫొటోలు ప్రచురించడం వివాదాస్పదంగా మారింది. నిజానికి వారికి తెలియక ఫ్లెక్సీల్లో వారి ఫొటోలు పెట్టారా? కావాలనే పెట్టారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఇలా పార్టీ ఫ్లెక్సీల్లో అధికారులు, గవర్నర్ ఫొటోలు ముద్రించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ పట్ల గవర్నర్ నర్సింహ్మన్ ప్రత్యేక అభిమానంతో ఉన్నట్లు విమర్శలు గుప్పుమంటున్న తరుణంలో ఈ ఫొటోల ప్రచురణ సరికొత్త చర్చకు దారితీస్తోంది.

click me!