హుజురాబాదులో ఈటెలకు చెక్: పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ నేతల గాలం

By telugu teamFirst Published May 6, 2021, 7:51 AM IST
Highlights

హుజూరాబాదు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. పెద్దిరెడిని పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది.

కరీంనగర్: హుజారాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ అధికారికంగా టీఆర్ఎస్ కు దూరమైన తర్వాత ప్రణాళికకు పదును పెట్టనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే హుజూరాబాదులోని పలువురు స్థానిక నాయకులను సంప్రదించారు. 

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ పార్టీకి తనంత తానుగా రాజీనామా చేస్తారా, పార్టీ నుంచి కూడా బహిష్కరణకు గురవుతారా అనేది తేలడం లేదు. అంతేకాకుండా, ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదు. దాంతో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక జరుగుతుంది.

హుజూరాబాదులో ఈటెల రాజేందర్ ను దెబ్బ తీయడానికి అవసరమైన ప్రణాళికను టీఆర్ఎస్ నేతలు సిద్ధం చేశారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధపడింది. పెద్దిరెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కరోనా వైరస్ కు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ నాయకులు సంప్రదించలేకపోయారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. 

పెద్దిరెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో  1999, 2004ల్లో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, 2014, 2018 ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. 

పెద్దిరెడ్డి 2018 ఎన్నికల్లో హైదరాబాదులోని కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నించారు. అయితే, చంద్రబాబు నందమూరి సుహాసినికి కూకట్ పల్లి టికెట్ ఇచ్చారు. 2019లో ఆయన బిజెపిలో చేరారు.

మూడు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటెల రాజేందర్ తనకు మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని తన భవిష్యత్తు కార్యాచరణపై ఈటెల రాజేందర్ అన్నారు.

click me!