మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి ప్రాణహాని... కాపాడండి: హెచ్చార్సీని ఆశ్రయించిన టీఆర్ఎస్ కౌన్సిలర్

Arun Kumar P   | Asianet News
Published : Jan 04, 2022, 02:26 PM ISTUpdated : Jan 04, 2022, 02:47 PM IST
మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి ప్రాణహాని... కాపాడండి: హెచ్చార్సీని ఆశ్రయించిన టీఆర్ఎస్ కౌన్సిలర్

సారాంశం

 మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి తనకు ప్రాణహాని వుందంటూ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ ను టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేసారు.

మహబూబ్ నగర్: రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) పై సొంతపార్టీకి చెందిన ప్రజాప్రతినిధే సంచలన ఆరోపణలు చేసారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి అక్రమాలకు పాల్పడుతున్నారని... వీటిని బయటపెట్టినందుకు తనను చంపించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 43వ వార్డు కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి (sudhakar reddy) ఆందోళన వ్యక్తం చేసారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి తనను కాపాడాలంటూ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ (HRC) ను ఆశ్రయించాడు టీఆర్ఎస్ కౌన్సిలర్. 

మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమంగా కొన్ని కట్టడాలు నిర్మించినట్లు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక మంత్రి కేటీఆర్ తో పాటు సంబంధిత అధికారులకు తాను ఫిర్యాదు చేసినట్లు కౌన్సిలర్ తెలిపాడు. అప్పటినుండి తనపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ గౌడ్ పోలీసుల ద్వారా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని సుధాకర్ రెడ్డి తెలిపాడు. 

ఏ తప్పూ చేయకున్నా తనపై మహబూబ్ నగర్ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని బాధిత కౌన్సిలర్ తెలిపారు. ఇంతటితో ఆగకుండా తనను హతమార్చాలని కూడా మంత్రి చూస్తున్నారంటూ సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. శ్రీనివాస్ గౌడ్ నుండి ప్రాణహాని వుంది... కాబట్టి తనను కాపాడాలని హెచ్చార్సీని కోరినట్లు కౌన్సిలర్ సుధాకర్ గౌడ్ తెలిపారు.

read more  నాకు సంబంధం లేదు: రామకృష్ణ కుటుంబం సూసైడ్‌పై ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవేంద్ర

అక్రమాలకు పాల్పడుతూ టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కు కౌన్సిలర్ విజ్ఞప్తి చేసాడు. అలాగే తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని సుధాకర్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను కోరారు.

గతంలో కూడా ఇలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి ప్రాణహాని వుందంటూ  మహబూబ్ నగర్ (mahabubnagar) కు చెందిన దంపతులు విశ్వరాధరావు, పుష్ఫలత హెచ్చార్సీ (human right commission)ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల సమయంలో మంత్రిపై నమోదయిన ఓ కేసులో సాక్ష్యం చెప్పినందుకు తమపై కక్ష పెంచుకున్నారని దంపతులు తెలిపారు. 

read more  రాష్ట్రంలో బీజేపీ అరాచకం సృష్టిస్తోంది - శాసనమండలి మాజీ ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి

అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న మంత్రి ఆదేశాలతో తమపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు వేధిస్తున్నారని బాధిత దంపతులు పేర్కొన్నారు. ఇంతటితో ఆగకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ తమను చంపించడానికి ప్రయత్నిస్తున్నాడని... వారి బారి నుండి కాపాడాలంటూ దంపతులు విశ్వనాధ రావు, పుష్పలత హెచ్చార్సీకి వేడుకున్నారు.

అప్పట్లో మంత్రి బెదిరింపుల వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యింది. అయితే తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ బారినుండి కాపాడాలంటూ టీఆర్ఎస్ కౌన్సిలరే హెచ్చార్సీని ఆశ్రయించడం మహబూబ్ నగర్ రాజకీయాల్లోనే కాదు టీఆర్ఎస్ లోనూ మరోసారి చర్చనీయాంశమయ్యింది. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !