మునుగోడు బైపోల్ 2022:రేపు టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్

By narsimha lode  |  First Published Oct 12, 2022, 3:06 PM IST

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  రేపు నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో లెఫ్ట్ పార్టీ ల నేతలు కూడా పాల్గొంటారు. 
 



హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ నెల 13న నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఈ నామినేషన్ కార్యక్రమానికి లెఫ్ట్ పార్టీల నేతలకు కూడా టీఆర్ఎస్ ఆహ్వానం పంపింది. టీఆర్ఎస్ అభ్యర్ధికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించినందున  ఆ పార్టీలను  కూడా నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్  నాయకత్వం ఆహ్వానం పలికింది. 

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. అయితే చివరకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ నాయకత్వం టికెట్ కేటాయించింది. భువనగిరి మాజీ ఎంపీ   బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లను సీఎం కేసీఆర్ పిలిపించి మాట్లాడారు.మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తామని బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ లు చెప్పారు.

Latest Videos

ఈ నెల 14వ తేదీ వరకే  నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో రేపు నామినేషన్ దాఖలు చేయాలని  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.  రేపు చండూరులో రిటర్నింగ్ అధికారికి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు హాజరు కానున్నారు. 

మునుగోడు ఎమ్మెల్యే పదవికి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటనే ఆమోదించారు.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు  రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.  ఈ ఏడాది ఆగస్టు 21న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.

also read:మునుగోడు బైపోల్ 2022: కాంగ్రెస్ ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరం?

ఈ నెల 10వ తేదీన  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 14న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

click me!