
తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రభుత్వం తరుపున ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ పథకం అనౌన్స్ చేసినా క్షణాల్లో తెలంగాణ సిఎం కేసిఆర్ చిత్రపటాలకు నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల వారు పాలాభిషేకం చేయడం ఆనవాయితీ అయిపోయింది. గడిచిన నాలుగేళ్ల కాలంలో వందలు, వేల సంఖ్యలో కేసిఆర్ ఫొటోలకు పాలాభిషేకాలు జరిగాయి.
కానీ ఇప్పటివరకు ఎవరు కూడా కేసిఆర్ కు స్వయంగా పాలాభిషేకం చేయలేదు. మరి పాలాభిషేకం విషయంలో తెలంగాణ స్పీకర్ ఒక అడుగు ముందుకేశారు. కేసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చూసిన జనాలకు కొత్త సీన్ ఆవిష్కృతమైంది. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది తెలంగాణ సర్కారు. దీంతో భూపాలపల్లిలో పెద్ద సంఖ్యలో కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఆ ఆనందంతో నియోజకవర్గంలోని శాయంపేట మండలంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఏకంగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికే పాలాభిషేకం చేసేశారు.
ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ జిందాబాద్ అంటూనే స్పీకర్ మధుసూదనాచారి జిందాబాద్ అని నినాదాలు చేశారు టిఆర్ఎస్ కార్యకర్తలు.
దశాబ్ద కాలంగా తెలంగాణ రాజకీయాలు పరిశీలిస్తే.. ఇప్పటివరకు కేవలం ఇద్దరు తెలంగాణ నేతలకు మాత్రమే పాలాభిషేకం జరిగింది. అందులో ఒకరు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శంకర్ రావు కాగా రెండో నాయకుడు.. స్పీకర్ మధుసూదనాచారి కావడం గమనార్హం. స్పీకర్ కు పాలాభిషేకం చేస్తున్న వీడియో పైన ఉంది చూడండి.