మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండు గంటల వ్యవధిలోనే భార్య భర్తలిద్దరూ మరణించారు. భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోగా.. ఆమె డెడ్ బాడీని తీసుకొస్తున్న సమయంలో భర్త కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో విషాదం చోటు చేసుకుంది. రెండు గంటల వ్యవధిలోనే ఇద్దరు భార్యభర్తలు మరణించారు. దీంతో వారి పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. ఆ పిల్లల వయస్సు పది సంవత్సరాల్లోపే ఉండటం, అనోన్యంగా కలిసే ఉండే దంపతులిద్దరూ ఒకే రోజు చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో మల్లికార్జున్ (33), తన భార్య శరణ్య (28)తో కలిసి జీవిస్తున్నాడు. ఈ దంపతులకు ఓంకార్, ఇవాంక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరికీ పదేళ్లలోపే వయస్సు ఉంటుంది. మల్లికార్జున్ ప్రైవేటు డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. భార్య ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో ఓ గొడవ తీవ్ర విషాదానికి దారి తీసింది.
కొంత కాలం కిందట శరణ్యకు ఇంటి పక్కన నివసించే రజిని అనే మహిళతో వాగ్వాదం జరిగింది. దీంతో చుట్టుపక్కల ఉండే వారి వచ్చి ఇద్దరినీ సముదాయించారు. గొడవ పడకూడదని ఇద్దరికీ సూచించారు. దీంతో అది సద్దుమణిగింది. అయితే వీరిద్దరి వాగ్వాదంలో స్థానికంగా ఉండే మరే మహిళ చొరబడింది. ఆమె ఇందులో జోక్యం చేసుకొని రజినిని రెచ్చగొట్టింది. ఆమెతో శర్యణపై పోలీస్ కంప్లైంట్ ఇప్పించింది.
దీంతో శరణ్య మనస్థాపం చెందింది. ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించి కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో కరీంగనర్ లో ని ఓ హస్పిటల్ లో శనివారం రాత్రి 11 గంటల సమయంలో చనిపోయింది. దీంతో భర్త తీవ్రంగా రోదించాడు. పుట్టెడు దుఖంలో భార్య డెడ్ బాడీని ఓ అంబులెన్స్ లో తీసుకొని, ఇతర బంధువులతో కలిసి బైక్ పై స్వగ్రామానికి బయలుదేరారు.
అంబులెన్స్ వెనకాల బైక్ పై వస్తూ మూత్ర విసర్జన కోసం లక్షెట్టిపేటలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మల్లికార్జున్ ఆగాడు. అనంతరం రోడ్డు దాటుతుండగా ఓ లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రగాయలతో అక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఆదివారం భార్యభర్తల ఇద్దరి మృతదేహాలకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. గంటల వ్యవధిలోనే భార్యభర్తలిద్దరూ చనిపోవడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.