న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్ మూసివేత.. అర్దరాత్రి వరకు మెట్రో..

By Sumanth KanukulaFirst Published Dec 31, 2022, 9:52 AM IST
Highlights

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో పలు ఫ్లైఓవర్‌లు, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)పై వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. 

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో పలు ఫ్లైఓవర్‌లు, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)పై వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై లైట్ మోటార్ వాహనాలు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదని రాచకొండ పోలీసులు తెలిపారు. మరోవైపు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేను కూడా మూసివేసి ఉంచనున్నారు. అయితే లైట్ మోటర్ వాహనాలపై ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు విమానం టికెట్లు చూపిస్తే అనుమతించనున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు బస్సులు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని పోలీసులు  తెలిపారు. 

ఇక, శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు నగరంలోని బేగంపేట, లంగర్ హౌజ్, సాగర్ రింగ్ రోడ్ మినహా అన్ని ఫ్లై ఓవర్లలో వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. హుస్సేన్ సాగర్, ఆ పరిసరాల్లో శనివారం రాత్రి 10 గంటల నుంచిఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్‌లలో వాహనాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. 

సైబరాబాద్​ పరిధిలో ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు క్లోజ్​చేయనున్నారు.  శిల్పా లేఅవుట్​ ఫ్లై ఓవర్​, గచ్చిబౌలి ఫ్లై ఓవర్​, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్​ 1,2, షేక్​పేట, మైండ్​స్పేస్​, రోడ్​ నెం.45 ఫ్లై ఓవర్,​ సైబర్​ టవర్స్​ ఫ్లై ఓవర్​,  జేఎన్టీయూ ఫ్లై ఓవర్, కైత్లాపూర్​ ఫ్లైఓవర్​, బాలానగర్ ఫ్లై ఓవర్​ను మూసివేసి ఉంచనున్నారు. హోటళ్లు, క్లబ్‌లు, పబ్‌లలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించేవారికి పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. 

ఇప్పటికే పలువురు ఈవెంట్స్ ఆర్గనైజర్స్‌తో మీటింగ్స్ కూడా నిర్వహించారు. తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే పరిణామాలపై తమ కస్టమర్‌లకు అవగాహన కల్పించాలని, అలాగే ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పోలీసులు నిర్వాహకులను కోరారు. ఈవెంట్స్‌లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఔట్ డోర్లో జరిగే ఈవెంట్స్ కి డీజే పర్మిషన్ లేదన్నారు. 

జంటనగరాల్లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని నిర్ణయించారు. మైనర్లు, మందుబాబులు వాహనాలు నడిపిన, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసులు నమోదు చేయనున్నట్టుగా చెప్పారు. 

అర్దరాత్రి వరకు మెట్రో.. 
న్యూ ఇయర్ వేడుకల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌ నగరంలో మెట్రో రైళ్ల వేళలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 31 అర్థరాత్రి ఒంటి గంట వరకు ఆయా మార్గాల్లో రైళ్ల‌ను నడుపుతున్నామని తెలిపారు. ప్రారంభ స్టేషన్‌‌లుగా ఉన్న ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గ, జేబీఎస్, ఎంజీబీఎస్ల నుంచి చివరి మెట్రో రాత్రి ఒంటి గంటకు బయలుదేరుతుంది. చివరి స్టేషన్‌కు 2 గంటలకు చేరుకోనుంది. మార్గ మధ్యలోని మెట్రో స్టేషన్‌లలో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే వారు సిబ్బంది, పోలీసుల‌కు స‌హ‌క‌రించాలని చెప్పారు. న్యూ ఈయర్ వేడుకల నేపథ్యంలో అన్ని స్టేషన్ల వద్ద భద్రతను పెంచినట్టుగా తెలిపారు. 

మరోవైపు మియాపూర్‌లోని కల్వరి టెంపుల్‌లో జరిగే ఉత్సవాలకు హాజరయ్యే వారి అర్ధరాత్రి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతోంది. డిసెంబర్ 31 అర్దరాత్రి దాటాక లింగపల్లి నుంచి హైదరాబాద్‌కు, లింగపల్లి నుంచి ఫలక్‌నుమాకు రెండు ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపనున్నట్టుగా దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. 

click me!