హైదరాబాద్ లో భారీ వర్షం: రోడ్ల మీద నరకం

By pratap reddyFirst Published 12, Sep 2018, 12:18 PM IST
Highlights

హైదరాబాదు నగరాన్ని మంగళవారం రాత్రి భారీ ముంచెత్తింది. సాయంత్రం ప్రారంభమైన వర్షం  30, 40 నిమిషాల పాటు కురుస్తూనే ఉండింది. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. 

హైదరాబాద్‌: హైదరాబాదు నగరాన్ని మంగళవారం రాత్రి భారీ ముంచెత్తింది. సాయంత్రం ప్రారంభమైన వర్షం  30, 40 నిమిషాల పాటు కురుస్తూనే ఉండింది. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాదు రోడ్లు నరకాన్ని తలపించాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ల వల్ల ఐదారు కిలోమీటర్లు ప్రయాణించడానికే గంటల కొద్ది సమయం పట్టింది.

హైదరాబాద్ లోని చార్మినార్‌లో అత్యధికంగా 6.6, ఆసీఫ్‌నగర్‌లో 6.3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. వానతో రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి పొర్లాయి. 

వెంగళ్‌రావునగర్‌, మధురానగర్‌, ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తా, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, బోరబండ, కూకట్‌పల్లి లోతట్టు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోకి కూడా నీరు చేరింది.


భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో వాహనాలు కొన్ని వాహనాలు నీటమునిగాయి. వాహనాలు సగానికి పైగా నీట మునిగి ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. 

వర్షానికి విద్యుత్‌ సరఫరాలో తీవ్రమైన అంతరాయాలు చోటుచేసుకున్నాయి. మైత్రివనం, రాజ్‌భవన్‌రోడ్‌, నిమ్స్‌ ఎదురుగా, సికింద్రాబాద్‌, బేగంపేట, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌, వెంకటగిరి ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. 
 
భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో వర్షాకాల అత్యవసర బృందాలు, డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు. మ్యాన్‌హోల్స్‌పై మూతలను తెరవకూడదని సూచించారు.

మ్యాన్‌హోళ్లపై ఫిర్యాదులను 155313 తెలియజేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించేందుకు 100, 040-21111111 నెంబర్లకు ఫిర్యాదులు చేయాలని చెప్పారు. 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST