
హైదరాబాద్: ముస్లీం, గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
సోమవారం నాడు గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి చేసిన పలు కార్యక్రమాలకు తెలంగాణ సీఎం కెసిఆర్ మద్దతు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధులకు కెసిఆర్ మద్దతు ప్రకటించిన విషయాలను ఆయన గుర్తు చేశారు. అంతేకాదు జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాల్లో కూడ కెసిఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లను కల్పించే విషయమై కేంద్రప్రభుత్వంతో కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. బిజెపితో కెసిఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకొన్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కెసిఆర్ వైఫల్యం చెందారన్నారు.
తమిళనాడు రాష్ట్రం తరహలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడ రిజర్వేషన్లను అమలు చేసేందుకు కృషి చేస్తామని అసెంబ్లీ వెలుపల, బయట కెసిఆర్ చెప్పిన విషయాలను ఆయన గుర్తు చేశారు. ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల కల్పించడంలో కెసిఆర్ కు చిత్తశుద్ది లేదని ఆయన ఆరోపించారు.