
Revanth Reddy: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ వేరు వేరు కాదని.. వారిద్దరూ ఒకటేనని, ప్రతిపక్షాల ఓట్లు చీల్చేందుకు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని సంచలన విమర్శలు చేశారు. హైదరాబాద్ గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బీజేపీ- బీఆర్ఎస్ మధ్య రహాస్య ఒప్పందం జరిగిందని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ లోపాయికారీ సహకారంతో మెదులుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బలంలేని చోట ప్రధాని మోడీ ఎందుకు పదే పదే మీటింగ్ లు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అయినా.. తెలంగాణ మీద ప్రధాని మోడీకి ఇప్పుడే లేని కొత్త ప్రేమ పుట్టుకొచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలపై అంత ప్రేమ ఉంటే.. విభజన హామీలు ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రధానిని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ లు ఒక్కటేనని పునరుద్ఘాటించారు.
అలాగే.. సీఎం కేసీఆర్ అవినీతి చేస్తున్నారని తెలిసినా దర్యాప్తు సంస్థలను ఎందుకు రంగంలోకి దించడం లేదని ప్రధానిని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ లేదని, కేవలం స్వార్థ రాజకీయాల కోసమే.. ఎప్పుడూ లేని హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్నిక వేళనే గిరిజన వర్సిటీ, పసుపుబోర్డు గుర్తొచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్లోలోనే ప్రధాని బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం, మద్యం కుంభకోణాల్లో జరిగిన అవినీతిని బయటపెడతానని ప్రజలకు సరైన స్పష్టత ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీల అమలుకై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు ఏ మేరకు అమలు చేశారో దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయినా మోదీ పర్యటన వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టమేమి లేదని రేవంత్ అన్నారు.