ఎటు చూసినా విఫలమే.. దొరపాలనపై గ్రంథం రాయొచ్చు: కేసీఆర్‌పై రాములమ్మ విమర్శలు

By Siva KodatiFirst Published Aug 18, 2020, 8:08 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వంపై సినీ నటి, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆమె విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వంపై సినీ నటి, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆమె విమర్శించారు.

తాజా పరిణామాలే దీనిని నిదర్శనమని రాములమ్మ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. చినుకు పడితే జలమయమయ్యే హైదరాబాద్‌ను ఎలాగూ కాపాడలేకపోయారని, ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనానికి వరంగల్ నగరం కూడా బలైందని విజయశాంతి ఆరోపించారు.

ఇక భూకబ్జాలను ఆపలేక రెవెన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ మధ్య బట్టబయలైన కోటి రూపాయల లంచం గటనే నిదర్శనమని ఆమె ధ్వజమెత్తారు.

తెలంగాణలో అత్యంత ప్రధానమైనదీ.. కోవిడ్ చికిత్సా కేంద్రంగాను ఉన్న గాంధీ ఆసుపత్రి పలుమార్లు అగ్ని ప్రమాదానికి గురైనా పట్టించుకున్న పాపాన పోలేరని రాములమ్మ విమర్శించారు.

ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైందని ఆమె దుయ్యబట్టారు. కోవిడ్ చికిత్సా వ్యవస్థ అనేది అటు ప్రభుత్వాసుపత్రులు, ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ కుప్పకూలిపోయిందనడానికి హైకోర్టు వేసిన మొట్టికాయల గాయాలే సాక్ష్యమన్నారు.

ప్రభుత్వ తీరుపై వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనిలేదని విజయశాంతి ఎద్దేవా చేశారు. మరోవైపు పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న అన్నదాతలను కనీసం స్థాయిలోనైనా ఆదుకోవాలని దుస్థితి తెలంగాణలో నెలకొందన్నారు.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ దొర పరిపాలనా వైఫల్యంపై పెద్ద గ్రంథమే రాయవచ్చని ఆమె విమర్శించారు. ఇకనైనా మేలుకోవాలని... పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దాలని రాములమ్మ హితవు పలికారు. 

click me!