అభివృద్ధి చేయలేకపోయానని రామలింగారెడ్డి బాధపడ్డారు: ఉత్తమ్

By Siva KodatiFirst Published Oct 31, 2020, 2:36 PM IST
Highlights

రఘునందన్ రావు, హరీశ్ రావులు బంధువులని దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ విజయం సాధిస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్‌లోకే వెళ్తారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

రఘునందన్ రావు, హరీశ్ రావులు బంధువులని దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ విజయం సాధిస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్‌లోకే వెళ్తారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన శనివారం జూమ్ యాప్, ఫేస్‌బుక్ ద్వారా కాంగ్రెస్ ఇన్‌ఛార్జీలతో మాట్లారు. 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ పరిస్ధితి బాగోలేదని.. ఇప్పుడు మెరుగైందన్నారు.

ప్రస్తుతం దుబ్బాకలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని.. దానిని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని ఆయన పార్టీ ఇన్‌ఛార్జీలకు సూచించారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు దుబ్బాకను మాత్రం పక్కనపెట్టారని ఉత్తమ్ ఆరోపించారు.

కానీ చెరుకు ముత్యం రెడ్డి మాత్రం దుబ్బాకను అభివృద్ధి చేశారని.. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుందని పీసీసీ చీఫ్ గుర్తుచేశారు. దివంగత రామలింగారెడ్డి దుబ్బాకలో నాలుగు సార్లు గెలిచినప్పటికి అభివృద్ధి మాత్రం చేయలేకపోతున్నానని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారని ఉత్తమ్ తెలిపారు.

అధికారంలో వున్నా కూడా అధికారులు తనకు సహకరించడం లేదని సోలిపేట ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. రామలింగారెడ్డికి మాత్రం పదవి ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్ ప్రశ్నించారు.

ఇప్పుడు హరీశ్ రావు దుబ్బాకలో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఆయన నిలదీశారు. రఘునందన్ రావుపై బీజేపీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. దుబ్బాకలో రాబోయే 36 గంటలు కీలకమని.. కాంగ్రెస్ ఓటింగ్‌ను పెంచేందుకు కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 

click me!