ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ... ముందే హెచ్చరించా, రాహుల్ పాదయాత్రకు కవరేజ్ రాకూడదనే : రేవంత్

By Siva KodatiFirst Published Oct 29, 2022, 5:25 PM IST
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బీజేపీ, టీఆర్ఎస్‌లు ఆడిన నాటకమని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నంపై సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ కంట్రోల్‌లో వుండే తెలంగాణ ఏసీబీతో విచారణ చేయించినా, బీజేపీ నియంత్రణలో వుండే సీబీఐతో విచారణ చేయించినా అసలు నిజాలు బయటకు రావని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

అలాగే ఆడియో టేపుల్లో నిందితులు చెబుతున్న దానిని బట్టి.. ఢిల్లీలో వున్న బీజేపీ పెద్దలను కూడా నిందితులుగా చేర్చాలని.. వారి తర్వాతే స్వామిజీలను చేర్చాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక టీఆర్ఎస్ వుంటే గనుక... ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్.. తర్వాత నలుగురు ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చాలన్నారు. ఇదిలావుండగా .. స్వామిజీ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు.. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

ALso Read:తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ పాదయాత్ర.. యాత్రలో పాల్గొన్న సినీ నటి పూనమ్ కౌర్..

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బీజేపీ, టీఆర్ఎస్‌లు ఆడిన నాటకమని ఆయన ఆరోపించారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు ఈ రెండు పార్టీలు కుట్రలు చేశాయని రేవంత్ దుయ్యబట్టారు. రఘునందన్ రావు ఇంట్లో దొరికిన డబ్బు ఏమైందో ఇప్పటికీ తేలలేదని... హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఈటల అంతు చూస్తానన్న కేసీఆర్ తర్వాత సైలెంట్ అయ్యారని ఆయన ధ్వజమెత్తారు. 

ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికను పురస్కరించుకుని మరోసారి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే కుట్ర పన్నాయని రేవంత్ ఆరోపించారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు తెలంగాణలో కవరేజ్ దక్కకుండా టీఆర్ఎస్, బీజేపీలు ఈ కుట్రకు తెరలేపాయని ఆయన మండిపడ్డారు. సరిగ్గా రాహుల్ పాదయాత్ర ప్రవేశించే సమయంలోనే ఈ వ్యవహారం వెలుగుచూసిందని రేవంత్ గుర్తుచేశారు. ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే హెచ్చరించానని ఆయన అన్నారు. 

 

దుబ్బాక ఉపఎన్నిక ముందు రఘునందన్ రావు, వాళ్ళ బామ్మర్ది, మామ ఇంట్లో దొరికిన డబ్బు ఎమైంది? రఘునందన్ రావు మీద పెట్టిన కేసులు ఏమయ్యాయి?

హుజూరాబాద్ ఉపఎన్నికయ్యాక ఈటెల రాజేందర్ని జైలుకు తోలుతామన్న కేసిఆర్, హరీష్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఎమయ్యాయి ఆ కేసులు? pic.twitter.com/0j6QXfysgT

— Telangana Congress (@INCTelangana)
click me!