ఆరు గ్యారెంటీలు అమలు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కాంగ్రెస్ నిర్ణయించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు . తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేసేందుకే గాంధీ కుటుంబం వచ్చిందన్నారు.
ఎందరో విద్యార్ధులు , యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం ములుగులో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక కుటుంబం చెరపట్టిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేసేందుకే గాంధీ కుటుంబం వచ్చిందన్నారు. తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై సోనియా గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని సోనియా భావించారని ఆయన వెల్లడించారు.
అందుకే ఆరు గ్యారెంటీలు అమలు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కాంగ్రెస్ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలు పొగ పొయ్యిలతో ఇబ్బంది పడకూడదని దీపం పథకం కింద గ్యాస్ స్టవ్‌లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. గ్యాస్ ధరను రూ.1200 చేసి మళ్లీ మహిళలను మోడీ సర్కార్ ఇబ్బంది పెట్టిందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కళ్యాణలక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సీతక్కను మరోసారి 50 వేల మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.