మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ దర్యాప్తు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
న్యూఢిల్లీ: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై సిట్ దర్యాప్తు మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మంగళవారంనాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సిట్ చెప్పాల్సిన వివరాలన్నీ మంత్రి కేటీఆర్ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఏ జిల్లాలో ఎంత మంది పరీక్ష రాశారు. ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చిన వివరాలను కూడ మంత్రి కేటీఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సిట్ అధికారిగా మంత్రి కేటీఆర్ ఈ విషయాలను చెప్పారన్నారు. కేటీఆర్ కు ఈ వివరాలు నిందితులు చెప్పారా, సిట్ అధికారి చెప్పారో వివరించాలని రేవంత్ రెడ్డి కోరారు. మంత్రి చెప్పకుండా పీఏ ఎలా పనిచేస్తారని ఆయన ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం కూడా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే నాలుగు పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను వాయిదా వేసింది.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ఈ విషయమై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. బండి సంజయ్ మాత్రం సిట్ విచారణకు హాజరు కాలేదు. సిట్ కు తన లీగల్ టీమ్ ద్వారా బండి సంజయ్ నోటీసులు పంపారు.టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ ఘటనలో సిట్ బృందం ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసింది. ఇంకా ఈ కేసులో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం లేకపోలేదు.