
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్‌ఎస్‌యూఐ మాజీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ (meenakshi natarajan) ఆధ్వర్యంలో 25 మందితో కూడిన బృందం 600 కిలోమీటర్ల మేర సర్వోదయ సంకల్ప పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు చేపడుతున్న ఈ యాత్ర మెదక్ జిల్లాలోకి ప్రవేశించింది. వీరికి మద్దతుగా రేవంత్‌రెడ్డి శనివారం పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
వరి కొనని సర్కారును ప్రజలే ఉరి తీస్తారని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాళేశ్వరం మూడో టీఎంసీ, మల్లన్నసాగర్, కొండ పోచమ్మకు భూములు త్యాగం చేసిన రైతులనే.. రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో మరోసారి దగా చేసేందుకు యత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రూ.కోట్లు పలికే ఎకరా భూమికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామనడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ద్వారా ఎంతో మంది భూములు కోల్పోతున్నారని రేవంత్ ఆరోపించారు. సీఎం ఫామ్ హౌజ్‌కు నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మించారని ఆయన వ్యాఖ్యానించారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఇది రాజకీయ పరమైన పాదయాత్ర కాదని స్పష్టం చేశారు. పేదల్లో ప్రతి ఒక్కరికీ భూమి ఉండాలని, అది సాధించేందుకే యాత్ర చేపట్టినట్లు మీనాక్షి వెల్లడించారు.
అంతకుముందు రైతు వేదికలను పునరుద్ధరించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి (revanth reddy) తెలంగాణ ప్రభుత్వాన్ని (telangana govt) డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు (kcr) లేఖ రాశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. రుణ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు, కల్తీ విత్తనాలు.. తదితర సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేదని.. మిర్చి, పత్తి రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రెండు నెలల్లో 20మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్యం వేదికలు మహబూబాబాద్ ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని... లక్ష రూపాయల రుణ మాఫీ వెంటనే అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లోని పిల్లలను ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి ప్రభుత్వం ఉచితంగా చదివించాలని ఆయన కోరారు. రైతులకు కల్పించే అన్ని సౌకర్యాలు కౌలు రైతులకూ కల్పించాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.